అమెరికాలో తొలి తెలుగు మహిళా జడ్జిగా ఆమెకు అరుదైన గౌరవం
అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం దక్కింది.
By Srikanth Gundamalla Published on 22 May 2024 12:39 PM ISTఅమెరికాలో తొలి తెలుగు మహిళా జడ్జిగా ఆమెకు అరుదైన గౌరవం
అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన జయ బాడిగ నియామకం అయ్యారు. దాంతో ఆమె అమెరికాలో ఒక కోర్టుకు జడ్జిగా నియామకం అయిన తొలి మహిళగా రికార్డుకెక్కారు. 2022 నుంచి ఆమె కోర్టు కమిషనర్‌గా పనిచేశారు. ఫ్యామిలీ లా నిపుణురాలుగా పేరొందారు. జయ బాడిగ న్యాయ సలహాల రంగంలో పలువురికి మార్గదర్శకురాలిగా వ్యవహరించారు.
కాగా.. జయ బాడిగ బిజినెస్ మ్యాన్, మచిలీపట్నం మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ కూతురు. ఈయనుకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. రామకృష్ణకు జయ బాడిగ మూడో కుమార్తె. ఏపీలోని విజయవాడలో ఆమె జన్మించారు. 1991-94 మధ్య హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో సైకాలజీ, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టుల్లో బీఏ పూర్తి చేసుకున్నారు. ఇక ఆ తర్వాత అమెరికాలోని బెఓస్టన్ విశ్వ విద్యాలయంలో రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. శాంటాక్లారా వర్సిటీ నుంచి లా పట్టాను పొందారు. అంతేకాదు.. జయ బాడిగ గవర్నర్ కార్యాలయం అత్యవసర సేవల విభాగంలో కూడా పనిచేశారు. మంగళవారమే ఆమె శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా ప్రమాణస్వీకారం చేశారు.
తన కూతురు అమెరికాలోని కోర్టుకు జడ్జిగా నియామకం కావడంతో.. మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. తన కూతురు సాధించిన దాని పట్ల కుటుంబ సభ్యులమంతా ఆనందంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు.. తెలుగువారు కూడా గర్వపడేలా జయ ఘనకీర్తిని సంపాదించడం గొప్పవిషయమన్నారు రామకృష్ణ. మరోవైపు తెలుగువారందరూ గర్వపడేలా తాను పనిచేస్తానని జస్టిస్ జయ బాడిగ చెప్పారు.