ఏడు సార్లు చేతులు మారిన మూడు నెలల పసిపాప

By -  Nellutla Kavitha |  Published on  30 March 2022 7:00 PM IST
ఏడు సార్లు చేతులు మారిన మూడు నెలల పసిపాప

ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి యునైటెడ్ నేషన్స్ బ్రేక్ ద బయాస్ అని పిలుపునిచ్చింది. ఆకాశంలో సగం అన్నింటా సమానం అంటూ మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు బాలికల కోసం ఎప్పటినుంచో పోరాటాలు చేస్తున్నాయి. మరోవైపు బేటీ బచావో బేటి పడావో అంటూ కేంద్ర ప్రభుత్వం బాలికల కోసం పథకాలను కూడా తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆడపిల్లల సంరక్షణ కోసం వివిధ చట్టాలను రూపొందించాయి. అయినప్పటికీ ఇంకా ఆడపిల్ల పుడితే తమకు భారంగా మారుతుందని భావించే తల్లిదండ్రులు అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డని అమ్ముకోవడానికి కూడా వెనుకాడట్లేదు కసాయి తల్లిదండ్రులు. ఇదే అవకాశంగా శిశు విక్రయ ముఠాలు కూడా రెచ్చిపోతున్నాయి. ఆడపిల్ల తమకు ఆర్థికంగా భారంగా మారుతుందని భావించిన తండ్రి బిడ్డని అమ్మకానికి ఉంచిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. శిశు విక్రయ ముఠాల చేతిలో పడి ఆ చిన్నారి మూడు నెలల్లోనే ఏడు సార్లు అమ్మకానికి గురైంది. మొదటిసారి తండ్రి 70000 కు ఆ చిన్నారిని అమ్మితే, చివరిసారిగా ఆ ఆడపిల్లని రెండున్నర లక్షలకు ఏడోసారి ఇంకెవరో కొనుగోలు చేశారు. దీనికంతటికీ కారణం అంతకుముందే వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉండడం. మూడోసారి ఆడబిడ్డ పుట్టడం తనకు భారంగా మారుతుందని భావించాడు తండ్రి. తల్లికి, అమ్మమ్మకు అనుమానం రావడంతో చివరికి ఈ విషయం బయటకు పొక్కింది.

గుంటూరు జిల్లా, మంగళగిరి పట్టణం గండాలయ పేటకు చెందిన మెడబలిమి మనోజ్‌ కు భార్య రాణి, ఇద్దరు కుమార్తెలున్నారు. మూడు మాసాల కిందట మనోజ్‌, రాణి దంపతులకు మూడో సంతానంగా అమ్మాయే పుట్టింది. మద్యానికి బానిసయిన మనోజ్ మూడునెలల చిన్నారిని అమ్మకానికి పెట్టాడు. మొదట తెలంగాణలోని నల్లగొండ జిల్లా కొండప్రోలుకు చెందిన మెగావత్‌ గాయత్రికి రూ.70 వేలకు విక్రయించాడు. ఆ తర్వాత ఈ చిన్నారిని గాయత్రి ఇదే జిల్లా పలకేడుకు చెందిన భూక్యా నందుకు రూ.1.20 లక్షలకు, నందు హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన షేక్‌ నూర్జహాన్‌కు రూ.1.87 లక్షలకు అమ్మేశాడు. ఆ తర్వాత నూర్జహాన్‌ ఈ పసికందును పశ్చిమగోదావరి జిల్లా బొమ్మాడ ఉమాదేవికి రూ.1.90 లక్షలకు విక్రయించగా, ఆమె విజయవాడ శివారులోని గొప్పపూడికి చెందిన గరికముక్కు విజయలక్ష్మికి రూ.2.20 లక్షలకు అమ్మేశారు. చివరగా ఆమె నుంచి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకి చెందిన వర్రె రమేశ్‌ చెంతకు పసిపాప చేరింది. పసిపాపను రమేశ్‌ రూ.2.50 లక్షలకు కొనుగోలు చేశారు.

పసిబిడ్డ కనిపించక పోవడంతో తండ్రిని నిలదీశారు కంటుంబసభ్యులు. శిశువు ఇలా చేతులు మారుతున్న సమయంలోనే చిన్నారి అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది‌. రంగంలోకి దిగిన గుంటూరు పోలీసులు శిశువులను విక్రయించే ముఠానే కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

దీంతో పోలీసులు తండ్రితో పాటు మరో పది మందిని అరెస్టు చేశారు. హైదరాబాద్ లో ఉన్న శిశువును తీసుకొచ్చి తల్లికి అప్పగించారు.

Next Story