రైతుల వద్ద వాతావరణానికి సంబంధించి సమగ్ర సమాచారం లేకపోవడంతో సరైన చర్యలు తీసుకోరు. దాంతో.. కొన్నిసార్లు కల్లంలో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వర్షాల వల్ల రైతులు ఎన్నో సార్లు నష్టపోయారు. ఈక్రమంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రైతుల చెంతకే వాతవరణానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించేందుకు దృష్టి పెట్టింది.
దేశ వ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు సమగ్ర వాతావరణ సమాచారాన్ని అందించిన జిల్లా ఆగ్రోమెటరోలాజికల్ యూనిట్ల నెట్‌వర్క్‌ను శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా వాతావరణ. వ్యవసాయ సమాచారాన్ని రైతుల చెంతకే చేర్చాలని ఆలోచన చేస్తోంది. గతంలో ప్రారంభించిన ఈ డీఏఎంయూఎస్‌లను ఈ ఏడాది ప్రారంభంలో భారత వాతావరణశాఖ మూసివేయాలని ఆదేశించింది. కానీ.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వాటిని పునరుద్ధరించే ప్రణాళిక ఏమైనా ఉన్నాయా? అని అడిగిన ప్రశ్నకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. డీఏఎంయూఎస్‌ను గతంలో తాత్కాలిక ప్రాతిపదికనే ఏర్పాటు చేశామన్నారు. ఈ సారి శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.