జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు అరెస్ట్

బ్యాంకును మోసం చేసిన కేసులో జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

By Srikanth Gundamalla  Published on  2 Sept 2023 8:40 AM IST
ED, Arrest,  jet airways, naresh goyal,

 జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు అరెస్ట్

బ్యాంకును మోసం చేసిన కేసులో జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కెనరా బ్యాంకుకి చెందిన రూ.538 కోట్ల నిధులను స్వలాభానికి పక్కదారి పట్టించినట్లు నరేశ్‌ గోయల్‌పై ఆరోపణలు ఉన్నాయి. దాంతో.. ముంబైలోని ఆయన ఆఫీసులో ఈడీ అధికారులు సోదాలు చేసి.. విచారణ జరిపారు. సుదీర్ఘ విచారణ తర్వాత చివరకు ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్‌ కింద అదుపులోకి తీసుకున్నారు. శనివారం నరేశ్ గోయల్‌ను ముంబైలోని పీఎంఎల్‌ఏ కోర్టులో ప్రవేశపెడతారు. గోయల్‌ కస్టోడియల్ రిమాండ్‌ను ఈడీ అధికారులు కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.

కెనరా బ్యాంకులో రూ.538 కోట్ల మోసానికి సంబంధించి జెట్ ఎయిర్‌వేస్, గోయల్, ఆయన భార్య అనిత, కొందరు మాజీ కంపెనీ ఎగ్జిక్యూటివ్లపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జెట్ ఎయిర్‌వేస్ (ఇండియా) లిమిటెడ్ (జెఐఎల్) కు రూ .848.86 కోట్ల రుణ పరిమితులు, రుణాలను మంజూరు చేసిందని, ఇందులో రూ .538.62 కోట్లు బకాయి ఉన్నాయని ఆరోపిస్తూ బ్యాంక్ చేసిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఖాతాను 2021 జూలైలో మోసంగా సీబీఐ ప్రకటించింది.

జెట్ ఎయిర్‌వేస్ సంబంధిత కంపెనీల్లోకి రూ.1410.41 కోట్ల నిధులు బదిలీ అయ్యాయని, వాటిల్లో సంస్థకు జారీ అయిన రుణ మొత్తం కూడా ఉందని కెనరా బ్యాంకు ఆరోపించింది. గోయల్ తన వ్యక్తిగత సిబ్బంది శాలరీలు, తన కుటుంబ ప్రయాణ ఖర్చులు కూడా జెయిట్ ఎయిర్ వేస్ రుణంలోంచే చెల్లించినట్టు పేర్కొంది. జెట్ లైట్ లిమిటెడ్ అనే మరో సంస్థ ద్వారా పెట్టుబడులు, అడ్వాన్సులు జారీ చేసి రుణ నిధులు మళ్లించిన విషయాన్నీ పేర్కొంది. వీటిల్లో కొన్ని కేటాయింపులను రకరకాల నిబంధనల పేరిట రద్దయిపోయినట్టు ప్రకటించారని తెలిపింది.

దాదాపు 25 ఏళ్ల పాటు నిరంతరాయంగా విమాన సేవలు నిర్వహించిన జెట్ ఎయిర్‌వేస్.. భారీ నష్టాలతో సర్వీసుల నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో విఫలం అయ్యింది. దాంతో.. 2019 ఏప్రిల్‌లో మూత పడింది. తర్వాత బ్యాంకులు నిర్వహించిన వేలంలో జలాన్ కల్రాక్ కన్సార్టియం.. జెట్ ఎయిర్‌వేస్ సంస్థ బిడ్ సొంతం చేసుకున్నది. ఇంకా జలాన్ కల్ రాక్ కన్సార్టియం ఆధ్వర్యంలో జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు ప్రారంభం కావాల్సి ఉంది.

Next Story