కాలుష్య నగరాల్లో వరల్డ్‌లోనే తొలి స్థానంలో ఢిల్లీ

కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా నగరాల్లో జనాలు ఊపిరి తీసుకోలేని పరిస్థితులు వస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on  5 Nov 2023 11:45 AM IST
Delhi, most polluted, city,  world,

 కాలుష్య నగరాల్లో వరల్డ్‌లోనే తొలి స్థానంలో ఢిల్లీ 

కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా నగరాల్లో జనాలు ఊపిరి తీసుకోలేని పరిస్థితులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కాలుష్య నగరాలపై స్విస్‌ గ్రూప్‌ ఐక్యూ ఎయిర్‌ (Swiss Group IQAir) నివేదికను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. దీంతో పాటు టాప్‌ 10 నగరాల్లో కోల్‌కతా, ముంబై నిలిచాయి. దాంతో.. దేశంలో ఉన్న ప్రధాన నగరాల్లో కాలుష్యంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

వరుసగా వాయు కాలుష్యం ఢిల్లీని వణికిస్తోంది. గత కొన్నాళ్లుగా వాయుకాలుష్యం కారణంగా ఢిల్లీని పొగమంచు కమ్మేస్తోంది. గాలి నాణ్యత తీవ్రంగా పడిపోతుంది. ఆదివారం ఉదయం ఏకంగా ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) 460గా నమోదైంది. రాజధానిలోని అనేక ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచిక 400 కంటే ఎక్కువగా నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో 500కు దగ్గరలో నమైదైంది. ఆదివారం ఉదయం 7 గంటల సమయానికి వాయు నాణ్యత సూచిక ఆయ నగర్‌లో 464, ద్వారకా సెక్టర్ 8లో 490, బవానాలో 479, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో 484, ఐటీఓలో 411, జహంగీర్‌పురిలో 465, లోధి రోడ్డులో 430, సిరి ఫోర్ట్‌లో 478గా నమోదైంది. ఎన్సీఆర్‌లో భాగమైన నోయిడా, గురుగ్రామ్‌ కూడా ఉదయం 7 గంటల సమయంలో తీవ్రమైన వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంది.

ఇక ఢిల్లీ తర్వాత అత్యంత కాలుష్య నగరాల జాబితాలో 371 పాయింట్లతో పాకిస్థాన్‌లోని లాహోర్‌ రెండో స్థానంలో ఉండగా, కోల్‌కతా (206), బంగ్లాదేశ్ రాజధాని ఢాకా (189), పాకిస్థాన్‌లోని కరాచీ (162) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక 162 పాయింట్లతో ముంబై ఆరో స్థానంలో ఉండగా, చైనాలోని షెన్యాంగ్ (159), హాంగ్జౌ (159), కువైట్ సిటీ (155), చైనాలోని వుహాన్ (152) టాప్‌ టెన్‌లో నిలిచాయి.

సాధారణంగా వాయు నాణ్యత సూచిక సున్నా నుంచి 50 మధ్య నమోదైతే గాలి మంచిగా ఉన్నట్టు అర్థం. 51 నుంచి 100 మధ్య నమోదైతే గాలి నాణ్యత సంతృప్తికరంగా ఉందని, 101 నుంచి 200 మధ్య నమోదైతే మోస్తరుగా ఉందని, 201 నుంచి 300 మధ్య నమోదైతే గాలి నాణ్యత బాగాలేదని, ఫేలవంగా ఉందని అర్థం. దీంతో గాలి నాణ్యత 200 దాటితే అనారోగ్యాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. 301 నుంచి 400 మధ్య నమోదైతే చాలా ఫేలవంగా ఉందని, 401 నుంచి 500 మధ్య నమోదైతే గాలి నాణ్యత బాగా దెబ్బతిందని, తీవ్రమైనదిగా ఉందని అర్థం.

తక్కువ ఉష్ణోగ్రతలు, గాలి సరిగా లేకపోవడంతోపాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లోని పొలాల్లోని పంట వ్యర్థాలను తగలబెట్టడం వంటి కారణాలతో ఢిల్లీలో గాలి కలుషితం అవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత ఏక్యూఐ 550కి చేరుకోవడంతో 2 కోట్ల మంది ప్రజలు కంటి, గొంతు సమస్యలతో బాధపడుతున్నారు.


Next Story