ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది.
By Srikanth Gundamalla Published on 7 May 2024 4:26 PM ISTఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి చుక్కెదురైంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఈ నెల 14వ తేదీ వరకు కస్టడీని పొడిగిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. కాగా.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగిసింది. దాంతో.. అధికారులు ప్రత్యక్షంగా ఎమ్మెల్సీ కవితను కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే.. కవిత కస్టడీ పొడిగించాలని ఈడీ కోర్టుకు విజ్ఞప్తి చేయగా.. ఏకీభవించిన న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ పొడిగింది. మే 14వ తేదీన కోర్టులో కవితను హాజరుపర్చాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వంటి వ్యక్తులను దేశం దాటించారని మండిపడ్డారు. కానీ.. తమ వంటి రాజకీయ నాయకులను టార్గెట్‌గా పెట్టుకుని అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. తన బంధువులను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా కోర్టును కవిత కోరారు. దాంతో.. కోర్టు ప్రాంగణంలో ఉన్న సెల్‌లో ముగ్గురు బంధువులతో కలిసి భోజనం చేసేందుకు ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఎమ్మెల్సీ కవితను మార్చి 15వ తేదీన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా.. మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని కూడా అవెన్యూ కోర్టు పొడిగింది. ఈ నెల 20వ తేదీ వరకు కస్టడీని పెంచింది.
ఇక ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో వారంలో ఎమ్మెల్సీ కవితపై ఈడీ అధికారులు చార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు ఇదే విషయాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక న్యాయస్థానానికి వివరించింది. 60 రోజుల్లోగా విధిగా ఈడీ చార్జ్‌షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. బలమైన కారణాలుంటేనే అదనంగా మరో నెల ఛార్జ్‌షీట్ దాఖలుకి సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలా మొత్తం గా 90 రోజుల్లో చార్జ్‌షీటు దాఖలు చేయాలి. అలా చేయకపోతే ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు డిఫాల్ట్ బెయిల్‌కు అర్హులు అవుతారు.