లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్‌ షాక్

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

By Srikanth Gundamalla  Published on  8 April 2024 5:16 AM GMT
delhi liquor scam case, kavitha, interim  bail petition, court,

లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్‌ షాక్

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇప్పటికే పలువురు ముఖ్యనేతలను ఈ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఇతర పార్టీల బాట పట్టారు. మరోవైపు కవిత అరెస్ట్ తర్వాత ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం కవిత, సీఎం కేజ్రీవాల్‌ తీహార్ జైలులో ఉన్నారు.

కాగా.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం ఉదయం తీర్పును వెల్లడించింది. ఈ తీర్పులో ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించలేదు. సీబీఐ స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి భవేజా కవితకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పును వెలువరించారు.

కాగా.. ఎమ్మెల్సీ కవిత తన కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌ అయిన ఇవ్వాలని రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఇప్పటికే ఆమె కుమారుడికి ఏడు పరీక్షలు పూర్తి అయ్యాయనీ.. బెయిల్‌ ఇవ్వొద్దని కోర్టును ఈడీ అధికారులు కోరారు. ఎమ్మెల్సీ కవిత రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి అనీ.. అలాంటి ఆమె బయటకు వెళ్తే ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయని కోర్టుకు ఈడీ తరఫు న్యాయవాది తెలిపారు. ఇక ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 4వ తేదీనే వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం ఇవాళ వెలువరించింది. ఈడీ తరఫున న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి భవేజా బెయిల్‌ నిరాకరిస్తున్నట్లు తీర్పును వెల్లడించారు.

ఇక మరోవైపు ఎమ్మెల్సీ కవితకు లిక్కర్‌ స్కాం కేసులో కోర్టు విధించిన జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. తాజాగా కవితకు మధ్యంతర బెయిల్‌ నిరాకరించడంతో.. మళ్లీ ఆమెను తీహార్ జైలుకు తరలిస్తారు. తిరిగి మంగళవారం కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. కాగా.. కవిత సాధారణ బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 20వ తేదీన ఇరుపక్షాల వాదనలు వింటామని ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టు చెప్పింది.

Next Story