అమెరికాలో జాహ్నవి మృతి ఘటన: మరణానంతరం డిగ్రీ పట్టా
జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ఇవ్వాలని ఆమె చదివిన నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ నిర్ణయించింది.
By Srikanth Gundamalla Published on 15 Sep 2023 5:45 AM GMTఅమెరికాలో జాహ్నవి మృతి ఘటన: మరణానంతరం డిగ్రీ పట్టా
అమెరికాలో రోడ్డు ప్రమాద ఘటనలో తెలుగు విద్యార్థిని జాహ్నవి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పోలీసుల వాహనం ఢీకొని యువతి మృతిచెందింది. మరణానంతరం పోలీసులు విద్యార్థిని మృతిపట్ల జోకులు వేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలంటూ అమెరికాను కోరాయి. అంతేకాదు.. యువతి మరణాన్ని చులకనగా మాట్లాడిన అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా కోరింది. ఇదిలా ఉండగా.. పోలీస్ వాహనం ఢీకొని ప్రాణాలు కోల్పోయిన జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ఇవ్వాలని ఆమె చదివిన నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ నిర్ణయించింది.
తెలుగు విద్యార్థిని జాహ్నవి మృతిపై యూనివర్సిటీ చాన్సిలర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన, దాని అనంతరం జరిగిన పరిణామాలతో క్యాంపస్‌లోని బారత విద్యార్థులు తీవ్రంగా ప్రభావితులు అయ్యారని చెప్పారు. ఈ సమయంలో భారతీయ విద్యార్థులందరికీ తాము అండగా ఉంటామని చాన్సిలర్ తెలిపారు. అలాగే ఈ ఘటనలో బాధ్యులకు తప్పకుండా శిక్ష పడాలని కోరుకుంటామని చెప్పారు. ఇక జాహ్నవి మరణానంతరం డిగ్రీ ప్రదానం చేయాలని నిర్ణయించినట్లు.. ఆమె కుటుంబ సభ్యులకు డిగ్రీ పట్టాను అందజేస్తామని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ చాన్సిలర్ తెలిపారు.
కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికా వెళ్లింది. నార్త్‌ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీలో చేరారు. జనవరి 23న రాత్రి కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డుదాటుతున్న క్రమంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. దాంతో.. యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై సియాటిల్ నగరానికి చెందిన పోలీసు అధికారి జోకులు వేస్తూ.. నవ్వుతూ మాట్లాడారు. ఆ మాటలన్నీ యువతి డెడ్‌బాడీకి అమర్చిన కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అవి తాజాగా వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యువతి మృతిపట్ల జోకులు వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.