తెలంగాణలో మాదిరి ఏపీలోనూ మార్పు తప్పదు: సీపీఐ నారాయణ
. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఫోకస్ అంతా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలపై పడింది.
By Srikanth Gundamalla
తెలంగాణలో మాదిరి ఏపీలోనూ మార్పు తప్పదు: సీపీఐ నారాయణ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా రేవంత్‌రెడ్డి నియమితులయ్యారు. అయితే.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఫోకస్ అంతా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలపై పడింది. 2024లో జరగబోయే ఎన్నికల కోసం అక్కడ పార్టీలు కూడా సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు.. ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు సీపీఐ నేత నారాయణ. అయన తిరుపతి వెళ్లిన సందర్భంగా అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఏపీ సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి పరాభవం తప్పదని అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చినంత మాత్రాన ఏమీ జరగదని అభిప్రాయపడ్డారు. వైసీపీ అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం ఉండదన్నారు. తెలంగాణలో మాదిరే ఏపీలో ప్రభుత్వం మార్పు తథ్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు.
ఏపీలో సీఎం జగన్ పాలనపై నారాయణ విమర్శలు చేశారు. ఆయన పాలనలో అహంకారం, నియంతృత్వం పెరిగిపోయిందని చెప్పారు. జగన్ హెలికాప్టర్‌లో తిరిగుతూ ఉంటారనీ.. అలా గాల్లో వెళ్తున్నప్పుడు ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. సీఎం జగన్ పర్యటన ఉంటే చాలు అక్కడుంటే స్థానిక నాయకులను నిర్బంధిస్తున్నారని అన్నారు. ఇలా నియంతలా వ్యవహరించడం చాలా దారుణమని అన్నారు. అందుకే రాబోయే ఎన్నికల్లో మార్పు తథ్యమని.. ప్రజలంతా గమనిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.