యుధ్దం నేపథ్యంలో మన గోధుమల కోసం చూస్తున్న దేశాలు
By - Nellutla Kavitha | Published on 21 March 2022 9:00 AM GMTరష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం నాలుగో వారానికి చేరుకుంది. ఒకవైపు ముడిచమురు ధరలు ఆకాశాన్ని అంటుతుంటే మరోవైపు ప్రపంచ దేశాలను ఆహార సంక్షోభం భయపెడుతోంది. యూరప్ దేశాలకు breadbasket గా వ్యవహరించిన రష్యా, ఉక్రెయిన్ దేశాలనుంచి గోధుమ ఎగుమతులు ఆగిపోయాయి. ప్రపంచ జనాభాకు కావలసిన గోధుమల్లో సగానికిపైగా రష్యా, ఉక్రెయిన్ నుంచే ఎగుమతి అవుతుంటాయి. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం వల్ల అవాంతరాలు ఏర్పడటంతో ఈజిప్ట్, ఇజ్రాయిల్ యెమన్, నైజీరియా దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. యుద్ధం వల్ల అనిశ్చితి ఏర్పడడంతో గోధుమల నిల్వలు పడిపోవడం తో పాటుగా, ధరలు విపరీతంగా పెరిగిపోతాయని ఈ దేశాలు భయపడుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ తర్వాత భారతదేశమే గోధుమలు ఎక్కువగా ఉత్పత్తి చేసే రెండో అతి పెద్ద దేశం.
ప్రపంచవ్యాప్తంగా గోధుమల ఉత్పత్తుల్లో 2020 కి గాను భారతదేశం నుంచి 14.14 శాతం గోధుమల ఉత్పత్తి జరిగితే, కేవలం ఒక్క శాతం మాత్రమే ఎగుమతి చేయగలిగింది భారత్. అయితే 2020-21 ఆర్థిక సంవత్సరానికిగానూ భారత్ ఖతార్, అఫ్ఘనిస్థాన్, ఇండోనేషియా మార్కెట్లలో కూడా ఎగుమతి చేయగలిగింది. ఇక ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో గోధుమల లభ్యత తగ్గిపోవడంతో, ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ 10 మిలియన్ టన్నులు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరం 6.6 మిలియన్ టన్నులు మాత్రమే ఎగుమతి చేయగలిగింది భారత్, ఇది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ. దీర్ఘకాల సంబంధాలు దృష్టిలో పెట్టుకుని, పంపించే గోధుమల నాణ్యత కూడా బాగుండాలని ఆలోచనలో ఉన్నారు భారత అధికారులు. ఇందుకోసం వ్యవసాయ శాఖాధికారులు, సహకార సంఘాలు, రైతులను సమన్వయపరిచి నాణ్యత గురించి చర్చించనున్నారు. అయితే ప్రస్తుతం ఏర్పడినటువంటి సంక్షోభం దృష్ట్యా ఇక్కడి నుంచి వివిధ దేశాలకు గోధుమలు పంపించడం కాస్త కష్టసాధ్యంగా కనిపిస్తోంది.
యుద్ధ ఛాయలు కనిపించని పోర్టులు, రోడ్లు, రైల్వే మార్గాలను గుర్తించాలని అధికారులను గవర్నమెంట్ ఆదేశించింది. భారతదేశం ప్రతి ఏటా దాదాపుగా 107.59 మిలియన్ టన్నుల గోదుమలను పండిస్తే అందులో మెజారిటీ దేశీయ అవసరాలకే సరిపోతుంది. మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్కు మన గోధుమల్లో 54% ఎగుమతి అవుతున్నాయి. ఇప్పటి దాకా బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, మలేషియా లాంటి దేశాలకు ఎగుమతి చేస్తోంది భారత్.