మేం సమాజానికి కళ్లలాంటివారం
By - Nellutla Kavitha |
సమ్మక్క - సారలమ్మ వన దేవతలపై తాను చేసిన వ్యాఖ్యలపై ఇటీవల చోటుచేసుకున్న వివాదంపై చినజీయర్ స్వామి వివరణ ఇచ్చారు. విజయవాడ సీతానగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళల్ని ఆదరించాలని భావించేవాడినని, అలాంటి తాము మహిళల్ని, దేవతల్ని చిన్నచూపుతో మాట్లాడతామని అనుకోవడం పొరపాటు అని అన్నారు. తమ మాటల పూర్వాపరాలు చూడాలని, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మాట్లాడిన దాని మధ్యలో ఒకదాన్ని చూపించి విమర్శించడం హాస్యాస్పదం అని జీయర్ స్వామి అన్నారు. సమతామూర్తి విగ్రహం చూడడానికి, నిర్వహణ కోసం టికెట్ పెట్టాం, అంతేగానీ అక్కడ పూజలకు, ప్రసాదాలకు టికెట్లు లేవన్నారు. గ్రామ దేవతలను అవమానించాననడం సరికాదు, దేవతలను చిన్నచూపుచూసే అలవాటు తమకు లేదని, కొందరు పనిగట్టుకుని వివాదాలు చేస్తున్నారని, తన వ్యాఖ్యల పూర్వాపరాలు చూడాలని, సొంతలాభాలకోసం కెమేరా ముందుకొచ్చి కొందరు మాట్లాడుతున్నారని అన్నారు. తాత్పర్యం తెలుసుకోకుండా కామెంట్ చేసేవారిని చూస్తే జాలికలుగుతుందని వ్యాఖాయానించారు జీయర్ స్వామి.
ఇక యాదాద్రితోపాటుగా రాజకీయాల గురించి కూడా ఆయన మాట్లాడారు. మాకు ఎవరితో గ్యాప్ లేదు, వారే పెట్టుకుంటే మాకు సంబంధం లేదని అన్నారు. తమను ఎవరన్నా సలహా అడిగితే ఇస్తామని, యాదాద్రి పునఃప్రారంభ మహోత్సవానికి పిలిస్తే వెళ్తాం లేదంటే చూసి ఆనందిస్తామని అన్నారు జీయర్ స్వామి. రాజకీయ నాయకులతో ఎవరితో పూసుకు తిరగమని, మాకు రాజకీయాలతో సంబంధం లేదని అన్నారాయన. తాము సమాజానికి కళ్లలాంటి వాళ్లమని అన్నారు చినజీయర్ స్వామి. స్యీయ ఆరాదణ సర్వ ఆదరణ గురించి చెప్పే తాము సమాజ హితం కోసం కార్యక్రమాలు చేసామని చెప్పారు.