ఢిల్లీలో బీజేపీ నేతలతో చికోటి ప్రవీణ్ సమావేశాలు.. త్వరలో పొలిటికల్‌ ఎంట్రీ?

క్యాసినో కింగ్‌ చికోటి ప్రవీణ్‌ ఢిల్లీలో ఉన్నారు. అక్కడ ఉన్న బీజేపీ నాయకులతో వరుసగా సమావేశం అవుతున్నట్లు తెలుస్తుంది.

By Srikanth Gundamalla  Published on  3 Aug 2023 10:59 AM GMT
Chikoti Praveen,  BJP Leaders, Delhi, Political Entry,

ఢిల్లీలో బీజేపీ నేతలతో చికోటి ప్రవీణ్ సమావేశాలు.. త్వరలో పొలిటికల్‌ ఎంట్రీ?

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌ ఢిల్లీలో ఉన్నారు. అక్కడ ఉన్న బీజేపీ నాయకులతో వరుసగా సమావేశం అవుతున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీలో ఉన్న బండి సంజయ్, డీకే అరుణ, రాంచందర్‌రావును కలిసినట్లు సమాచారం అందుతోంది. ఇప్పటి పలు వివాదాల్లో ఉన్న చికోటి ప్రవీణ్‌ తెలంగానలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ నేతలతో అతను వరసగా భేటీ అవుతుండటంతో.. పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరేందుకు లైన్‌ క్లియర్‌ అయినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కూడా దగ్గరపడుతున్నాయి. ఈ ఏడాది చివర్లోనే ఎన్నికలు జరగనున్నాయి. చికోటి ప్రవీణ్‌ బీజేపీలో చేరుతారనే వార్తలే కాదు.. ఆయన ఎమ్మెల్యే టికెట్‌ కూడా ఆశిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్‌ ఏదో ఒక చోటు నుంచి టికెట్‌ కూడా ఆశిస్తున్నారని తెలుస్తోంది. అక్రమంగా క్యాసినోలు నిర్వహించడం, నిబంధనలకు విరుద్ధంగా వన్యప్రాణులను పెంచుకోవడం సహా ఇంకా కొన్ని కేసుల్లో చికోటి ప్రవీణ్ ఉన్నారు. రేషన్ షాపు నిర్వహించడం నుంచి మొదలైన చికోటి ప్రవీణ్ జీవితం.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఆ తర్వాత క్యాసినోలు నిర్వహించడం, రాజకీయ నేతలు, సెలబ్రిటీలతో సంబంధాలు నెరపడం వరకు సాగింది. చికోటి ప్రవీణ్ పై ఈడీ కేసులు నమోదైన విషయం తెలిసిందే.

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన లాల్‌ దర్వాజా బోనాల్లో కూడా చికోటి ప్రవీణ్‌ హల్‌చేసిన విషయం తెలిసిందే. ఆలయానికి గన్‌మెన్లతో వెళ్లారు. ఆలయానికి గన్‌మెన్లతో రావడం వివాదాస్పదం అయ్యింది. ఈ క్రమంలో చికోటి ప్రవీణ్‌పై ఛత్రినాక పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే.. ఈ కేసులో చికోటి ప్రవీణ్ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. హైదరాబాద్, ఏపీతో పాటు థాయిలాండ్, నేపాల్‌ దేశాల్లో క్యాసినో వ్యవహారాల్లో చికోటి ప్రవీణ్‌ ఉన్నారని ఆయన పేరు వినిపించింది. చికోటి ప్రవీణ్ తాను ఎప్పుడూ హిందూత్వం కోసం పనిచేస్తానని చెప్పుకుంటాడు. అయితే.. ఢిల్లీలో బీజేపీ నేతలు బండి సంజయ్‌, డీకే అరుణ సహా పలువురు నేతలను చికోటిప్రవీణ్ కలిశాడు. వారికి శాలువా కప్పి సన్మానించాడు. దాంతో పొలిటికల్ ఎంట్రీపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరి.. ఇలాంటి నేర చరిత్ర ఉన్న చికోటి ప్రవీణ్‌ను బీజేపీ ఆహ్వానిస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.

Next Story