ఇవాళ తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. చర్చించే అంశాలివే...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఇవాళ సాయంత్రం సమావేశం కానున్నారు.
By Srikanth Gundamalla Published on 6 July 2024 6:25 AM ISTఇవాళ తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. చర్చించే అంశాలివే...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఇవాళ సాయంత్రం సమావేశం కానున్నారు. ఇద్దరూ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సంకల్పించుకున్నారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు బాధ్యతల స్వీకరణ తర్వాత ఇదే విషయాన్ని సోషల్ మీడియా, లేఖల ద్వారా తెలిపారు. తాజాగా సీఎం చంద్రబాబు హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలోనే సాయంత్రం ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం ఉండనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.
ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి చర్చించనున్నారు. షెడ్యూలు 9, షెడ్యూలు 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది. విద్యుత్తు సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చిస్తారని సమాచారం. దాదాపు రూ.24 వేల కోట్లు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. కానీ.. రూ.7 వేల కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతోంది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.
మరోవైపు మైనింగ్ కార్పొరేషన్ సంబంధిత నిధుల పంపిణీ విషయంలో చిక్కుముడి ఇటీవల వీడింది. విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారులు దాదాపు 30 సార్లు సమావేశం అయ్యారు. షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 90 సంస్థలు ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోం శాఖ షీలాబీడే కమిటీని వేసింది. తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. ఈ క్రమంలోనే ఈ సమస్యలన్నింటీపై ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య చర్చ జరుగనుంది.