చంద్రుడివైపు ప్రయాణిస్తోన్న చంద్రయాన్-3

18 రోజులుగా భూకక్ష్యల్లో పరిభ్రమిస్తున్న చంద్రయాన్-3 చంద్రుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది.

By Srikanth Gundamalla  Published on  1 Aug 2023 2:40 AM GMT
chandrayaan-3, leaves earth,  Moon, orbit,

చంద్రుడివైపు ప్రయాణిస్తోన్న చంద్రయాన్-3

చంద్రయాన్-3 ప్రయాణంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. 18 రోజులుగా భూకక్ష్యల్లో పరిభ్రమిస్తున్న చంద్రయాన్-3 మంగళవారం చంద్రుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది. ఈ మేరకు ఇస్రో ప్రకటన చేసింది. ప్రస్తుతం ఈ స్పేస్క్రాఫ్ట్‌.. భూమి కక్ష్యను వీడి, చంద్రుడి వైపు ప్రయాణిస్తోందని తెలిపింది.

ట్రాన్స్‌లునార్​ ఆర్బిట్​లోకి చంద్రయాన్​-3ని పంపించే ప్రక్రియను పూర్తి చేశామని ఇస్రో తెలిపింది. ఈ ప్రక్రియను పిరేగీ- ఫైరింగ్​ అని అంటారు. ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్​ అండ్​ కమాండ్​ నెట్‌వర్క్‌లో దీనిని పూర్తి చేశామని తెలిపారు శాస్త్రవేత్తలు. ఫలితంగా ఈ వ్యోమనౌక ​ భూమి చుట్టూ తిరగడం ఆపేసి, చంద్రుడివైపు ప్రయాణాన్ని మొదలుపెట్టిందని తెలిపారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇక తదుపరి ప్రక్రియ.. లూనార్​ ఆర్బిట్​లోకి వ్యోమనౌక​ను ఇంజెక్ట్​ చేయడమే అని ఇస్రో వెల్లడించింది. ఇది 2023 ఆగస్ట్​ 5న జరగనుందని స్పష్టం చేసింది. దాంతో.. తాము అనుకున్నట్లు మిషన్‌ ముందుకు వెళ్తోందని ఇస్రో వెల్లడించింది. ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు ప్రయత్నాలు చేస్తామని ఇస్రో పేర్కొంది. ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్‌తో కూడిన చంద్రయాన్-3 జూలై 14న శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి ప్రయాణం ప్రారంభించిన విషయం తెలిసిందే.

చంద్రయాన్‌ ప్రాజెక్టులో ఇప్పటి వరకు ఇస్రో మూడుసార్లు ప్రయోగాలు చేసింది. తొలిసారి చంద్రయాన్-1 విజయవంతం అయ్యింది. అప్పుడు చంద్రుడిపై నీటి జాడలు ఉన్నట్లు వెల్లడించింది. దాంతో ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఇక 2019లో రెండో ప్రయోగం చేపట్టగా.. చంద్రయాన్‌-2 విఫలం అయ్యింది. ల్యాండింగ్‌ వరకు ఈ ప్రయోగం వెళ్లినా.. చంద్రుడి ఉపరితలంపై దిగే సమయంలో విఫలమై కుప్పకూలిపోయింది. ప్రస్తుతం చంద్రయాన్-3 ప్రయోగానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సాఫ్ట్‌వేర్‌ను పూర్తిగా మార్చింది ఇస్రో. చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగే ఈ ప్రయోగంలో కీలక ఘట్టంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండ్‌ అయిన నాలుగో దేశంగా భారత్‌ నిలుస్తుంది. ఇప్పటిదాకా ఈ ఘనత అమెరికా, సోవియట్ యూనియన్, చైనా పేరిట ఉన్నాయి.


Next Story