అప్పటిదాకా చంద్రబాబుని అరెస్ట్‌ చేయొద్దు: సుప్రీంకోర్టు

ఫైబర్ నెట్ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

By Srikanth Gundamalla  Published on  9 Nov 2023 2:22 PM IST
chandrababu, tdp, supreme court, fibrenet case,

అప్పటిదాకా చంద్రబాబుని అరెస్ట్‌ చేయొద్దు: సుప్రీంకోర్టు

ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్‌పై వేసిన విషయం తెలిసిందే. అయితే.. గురువారం సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌పై విచారించింది. ఆ తర్వాత విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. నవంబర్‌ 30న విచారణ చేపడతామని ఉన్నతన్యాయస్థానం వెల్లడించింది. ఇక ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీం కేసుపై కూడా తీర్పును దీపావళి పండగ తర్వాత ప్రకటించనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

కాగా.. ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ గురువారం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చింది. సుప్రీంకోర్టు నంబర్ 6లో ఐటమ్ నంబర్ 11గా చంద్రబాబు కేసు విచారణకు వచ్చింది. జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ముందు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కేసును వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. నవంబర్ 30న కేసును విచారిస్తామని వెల్లడించింది. అప్పటి వరకు ఫైబర్ నెట్‌ కేసులో చంద్రబాబుని అరెస్ట్‌ చేయొద్దని సుప్రీంకోర్టు వెల్లడించింది. అలాగే ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీం కేసుపై కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో తీర్పును అత్యున్నత ధర్మాసనం రిజర్వు చేసింది. పాత ఆర్డర్‌ ప్రకారం దీపావళి సెలవుల తర్వాత తీర్పుని వెల్లడిస్తామని సుప్రీంకోర్టు చెప్పింది.

ఇక ఏపీ ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను అక్టోబర్‌ 9న ఏపీ హైకోర్టు తిరస్కరించింది. విచారణ కీలక దశలో ఉందని.. అందుకే బెయిల్ ఇవ్వడం కుదరదని హైకోర్టు నిరాకరించింది. దాంతో.. తీర్పును సవాల్‌ చేసిన చంద్రబాబు.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెక్షన్ 17ఏ నిబంధన ఈ కేసులోనూ ఉన్నందున స్కిల్‌ కేసు తీర్పు వచ్చాక విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే.. కేసు ముగిసేవరకూ అరెస్ట్‌ చేయబోమన్న నిబంధన కొనసాగించాలని చంద్రబాబు తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. గత హామీ మేరకే ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తెలిపారు. కేసు విచారణను ఈనెల 23కి వాయిదా వేయాలని తొలుత ధర్మాసనం నిర్ణయించింది. చంద్రబాబు తరఫు న్యాయవాది విజ్ఞప్తి మేరకు విచారణను సుప్రీంకోర్టు నవంబర్‌ 30వ తేదీకి వాయిదా వేసింది.

Next Story