చంద్రబాబుకి కంటి ఆపరేషన్ 40 నిమిషాల్లో పూర్తి
హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చంద్రబాబు కంటి ఆపరేషన్ చేయించుకున్నారు.
By Srikanth Gundamalla
చంద్రబాబుకి కంటి ఆపరేషన్ 40 నిమిషాల్లో పూర్తి
ఏపీ స్కిల్ డెవల్‌మెంట్ స్కీం కేసులో అరెస్ట్ అయ్యిన చంద్రబాబుకు అనారోగ్యం కారణంగా కోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ సర్జరీ 45 నిమిషాల్లో పూర్తి చేశారు ఎల్వీప్రసాద్ వైద్యులు. ఈ ఆపరేషన్ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ ద్వారా తన ఇంటికి వెళ్లిపోయారు. కాగా.. జూన్‌లో చంద్రబాబు ఎడమ కంటికి సర్జరీ జరిగింది. ఇప్పుడు కుడి కంటికి శస్త్ర చికిత్స అందించారు వైద్యులు.
కుడి కంటికి సర్జరీ జరిగిన కారణంగా చంద్రబాబు కొద్దిరోజుల పాటూ పూర్తి విశ్రాంతి తీసుకొన్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన్ని కలిసేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో సర్జరీ జరుగుతున్న సమయంలో ఎల్వీప్రసాద్ ఆస్పత్రికి కూడా చంద్రబాబుని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు 50 కి పైగా రోజులు రాజమండ్రి సెట్రల్ జైల్లో ఉన్నారు. జైల్లో సౌకర్యాలు లేకపోవడంతోనే అనారోగ్యానికి గురయ్యారని టీడీపీ నేతలు, ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. జైల్లో ఉన్న సమయంలోనే ఆయనకు చర్మ సంబధిత సమస్య ఎక్కువైంది. ఉక్కపోత వల్ల చర్మ సంబంధిత సమస్య పెరిగిందని వైద్యులు చెప్పారు. కంటి చికిత్స కోసం జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చిన చంద్రబాబు.. మొదట హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో రెండు రోజుల పాటు పరీక్షలు చేయించుకున్నారు.