చంద్రబాబు అరెస్ట్‌పై వినూత్న నిరసన, మియాపూర్ మెట్రో స్టేషన్ మూసివేత
చంద్రబాబు అరెస్ట్‌ని వ్యతిరేకిస్తూ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు హైదరాబాద్‌లో వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 11:36 AM IST
చంద్రబాబు అరెస్ట్‌పై వినూత్న నిరసన, మియాపూర్ మెట్రో స్టేషన్ మూసివేత
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై హైదరాబాద్‌లో మరోసారి నిరసనలు చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్‌ని వ్యతిరేకిస్తూ ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు హైదరాబాద్‌లో వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ‘లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్’ కార్యక్రమం తలపెట్టారు.చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైల్‌లో నల్ల టీ-షర్టులు ధరించి ప్రయాణించాలని చంద్రబాబు మద్దతుదారులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మియాపూర్ మెట్రో స్టేషన్ వద్దకు టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు భారీ ఎత్తున చేరుకున్నారు. దాంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.
మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొనేందుకు చేరుకున్నారు. దాంతో.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా అక్కడికి చేరుకున్నారు. మియాపూర్ మెట్రో స్టేషన్‌ను మూసేయాలంటూ అధికారులకు పోలీసులు సూచించారు. దాంతో.. అప్రమత్తమైన మెట్రో అధికారులు టెక్నికల్ సమస్య అని చెబుతూ మియాపూర్ మెట్రో స్టేషన్‌ను కాసేపు మూసివేశారు. మెట్రో స్టేషన్ మూసివేయడంతో ఆగ్రహానికి లోనైన చంద్రబాబు మద్దతుదారులు మెట్రో స్టేషన్‌లో అధికారులతో వాగ్వాదానికి దిగారు. మంచితనానికి కష్టాలు ఎక్కువ అనీ.. చంద్రబాబు మంచి తనమే ఆయనకు కష్టాలు తెచ్చిపెట్టాయంటూ మండిపడ్డారు. తాము ప్రశాంత వాతావరణంలో నిరసన తెలపాలని అనుకుంటే మెట్రో అధికారులు అడ్డుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు. పోలీసులు కూడా నిరసన కారులను లోనికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దాంతో.. మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.
చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా మియాపూర్ నుంచి ఎల్బీనగర్ మెట్రోలో నల్ల టీషర్టులు ధరించి ఉదయం 10.30 గంటల నుంచి ఉదయం 11.30 గంటల మధ్య ప్రయాణం చేయాలని మద్దతుదారులు పిలుపునిచ్చారు. నల్లటీషర్లు వేసుకుని మద్దతుదారులు ఒక్కసారిగా రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. నిరసనకారులను అడ్డుకున్న తర్వాత.. కాసేపటికి మెట్రో స్టేషన్‌లోకి ప్రయాణికులకు మెట్రో అధికారులు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.