సీఎం చంద్రబాబుకి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ
తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు అంశం సంచలనంగా మారింది.
By Srikanth Gundamalla Published on 20 Sep 2024 10:19 AM GMTతిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు అంశం సంచలనంగా మారింది. భక్తుల్లో తీవ్ర ఆందోళన రేపుతోంది. మరోవైపు రాజకీయంగానూ విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఇదే అంశంపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకి లేఖ రాశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. ఇది క్షమించరాని నేరమని పేర్కొన్నారు. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరారు. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని బండి సంజయ్ లేఖలో కోరారు.
లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు అంశం హిందుల మనోభావాలను తీవ్రంగా కలచివేస్తోందని బండి సంజయ్ లేఖలో రాశారు. తిరుమల పవిత్రతను దెబ్బతీశారని అన్నారు. అన్యమత ప్రచారం జరుగుతోందని గతంలో ఫిర్యాదులు వచ్చినా అప్పటి పాలకులు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎర్రచందనం కొల్లగొడుతూ ఏడు కొండలవాడిని రెండు కొండలకే పరిమితం చేశారని చెప్పినా స్పందించలేదన్నారు. ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగించడం అత్యంత నీచమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. దీన్ని హిందూ ధర్మంపై జరిగిన భారీ కుట్రగానే భావిస్తున్నామని సీఎం చంద్రబాబుకి రాసిన లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు. తిరమల తిరుపతి దేవస్థానంపై కోట్ల మంది భక్తులకు ఉన్న విశ్వాసాన్ని సడలించేందుకు ఈ కుట్ర చేశారనీ.. దీన్ని అస్సలు క్షమించకూడదని బండి సంజయ్ అన్నారు.
ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రమేయం వల్లే ఇది జరిగి ఉంటుందని అన్నారు. లేదంటే ఈ కల్తీ దందా జరిగే అవకాశం లేదని బండి సంజయ్ అన్నారు. అందుకే సీబీఐతో విచారణ జరిపిస్తే వాస్తవాలు నిగ్గు తేలే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అంతిమ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తీసుకోవాలని బండి సంజయ్ రాసిన లేఖలో పేర్కొన్నారు.