ఆ రాష్ట్రాల్లో కేంద్రం కీలక నిర్ణయం
By - Nellutla Kavitha | Published on 31 March 2022 5:30 PM ISTకేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక చట్టం పరిధి కుదించింది. అసోం, మణిపూర్, నాగాలాండ్ లో వివాదాస్పదంగా మారిన సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని కుదిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈశాన్య రాష్ట్రాలలో తిరుగుబాటుదారుల అణిచివేత కోసం ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ పేరుతో కేంద్ర ప్రభుత్వం గతంలో ఒక చట్టాన్నితీసుకొచ్చింది.
అయితే భద్రతా దళాలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలతో పాటుగా ఆందోళనలు కూడా నిర్వహించారు అక్కడి స్థానికులు. భద్రతా దళాలు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని పోరాటాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో చట్టం పరిధిలోని ప్రాంతాలను కుదిస్తూ తాజాగా కేంద్ర నిర్ణయం తీసుకుంది.
ఈశాన్య రాష్ట్రాల్లోని శాశ్వత శాంతి నెలకొల్పేందుకు, తీవ్రవాదాన్ని అంతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న అనేక ఒప్పందాలు, నిరంతర ప్రయత్నాల కారణంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ పరిధిలోని ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ప్రత్యేక చట్టం పరిధి కుదుస్తూ నిర్ణయం తీసుకోవడంపై ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.