ఏపీ డిప్యూటీ సీఎంపై హైదరాబాద్‌లో కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై హైదరాబాద్‌లో కేసు నమోదు అయ్యింది.
By Srikanth Gundamalla Published on 8 Jan 2024 9:30 PM ISTఏపీ డిప్యూటీ సీఎంపై హైదరాబాద్‌లో కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై హైదరాబాద్‌లో కేసు నమోదు అయ్యింది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఫిర్యాదు మేరకు బేగంబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని బేగంబజార్ పోలీసులకు మల్లు రవి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోనియాపై వ్యాఖ్యలు చేసినందుకు గాను నారాయణస్వామిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు మల్లు రవి. కాగా.. వైఎస్ మరణానికి కారణం సోనియాగాంధీ, చంద్రబాబేనని ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కామెంట్ చేశారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. నారాయణస్వామి వ్యాఖ్యలను మల్లు రవితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు తప్పుబడుతున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మల్లు రవి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వైఎస్సార్‌కు సోనియాగాంధీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారని గుర్తు చేశారు. అలాంటి సోనియాగాంధీ గురించి తప్పుగా మాట్లాడటం సరికాదన్నారు. వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదానికి గురి అయినప్పుడు సోనియాగాంధీ ప్రత్యేకంగా విమానాలను పంపించి నల్లమలలో వెతికించారని గుర్తు చేశారు. ప్రతికూల వాతావరణం వల్లే హెలికాప్టర్ ప్రమాదం జరిగిందనే విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గ్రహించాలని చెప్పారు మల్లు రవి. సోనియాగాంధీ గురించి చేసిన వ్యాఖ్యలను ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని మల్లు రవి హెచ్చరించారు.