అల్లు అర్జున్‌కు షాక్.. కేసు నమోదు

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు బిగ్‌ షాక్ తగిలింది.

By Srikanth Gundamalla  Published on  11 May 2024 9:30 PM IST
case,  allu arjun, Shilpa ravi Chandra, Andhra Pradesh,

అల్లు అర్జున్‌కు షాక్.. కేసు నమోదు 

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు బిగ్‌ షాక్ తగిలింది. శనివారం నంద్యాలకు వెళ్లిన అల్లు అర్జున్‌.. తన స్నేహితుడు నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రను కలిశారు. అయితే.. నంద్యాలలో ఫ్రెండ్‌ను కలిసేందుకు వెళ్లిన అల్లు అర్జున్‌పై కేసు నమోదు అయ్యింది. అల్లు అర్జున్‌తో పాటుగా ఎమ్యెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు.

అల్లు అర్జున్ ఆయన సతీమణి స్నేహారెడ్డితో కలిసి నంద్యాల వెళ్లారు. సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ని కలిశారు. ఇక అభిమానులు, వైసీపీ కార్యకర్తలు అల్లు అర్జున్‌ శిల్పా రవిచంద్ర ఇంటికి వచ్చాడని తెలుసుకుని భారీ ఎత్తున అక్కడికి వెళ్లారు. దాంతో.. అక్కడంతా జనాలతో కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్, శిల్పా రవి ముందస్తు అనుమతి లేకుండా నంద్యాలలో ర్యాలీ నిర్వహించారని రిటర్నింగ్‌ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్‌వో ఫిర్యాదు మేరకు పోలీసులు అల్లు అర్జున్‌తో పాటు, శిల్పా రవిపై కేసు నమోదు చేశారు.

కాగా.. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డి .. అల్లు అర్జున్‌కి స్నేహితుడు. ఈ క్రమంలోనే స్నేహితుడికి మద్దతు తెలిపేందుకు అల్లు అర్జున్‌ నంద్యాలకు వెళ్లారు. గత ఎన్నికల సమయంలో కూడా శిల్పా రవిచంద్రకు ఐకాన్‌ స్టార్ మద్దతు తెలిపారు. ఈసారి ట్వీట్ చేస్తే సరిపోదని.. నేరుగా ఇంటి వద్దకు వచ్చి మద్దతు తెలియజేశానని చెప్పారు. అభిమానులు కూడా గజమాలతో అల్లు అర్జున్‌కు ఘనస్వాగతం పలికారు. బన్నీ కోసం భారీగా వాహనాల ర్యాలీ తీశారు. ఇక ర్యాలీతో శిల్పా రవిచంద్ర ఇంటికి వెళ్లి.. అల్లు అర్జున్ అభిమానులకు అభివాదం చేశారు.

Next Story