మొబైల్ ఫోన్ కొంటే పెట్రోల్, నిమ్మకాయలు ఫ్రీ
By - Nellutla Kavitha | Published on 21 April 2022 3:59 PM IST
ఎండాకాలంలో చల్లదనాన్ని ఇచ్చే నిమ్మకాయల ధరలు ఎప్పుడూ లేనంతగా ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు మధ్యతరగతిజీవికీ పెట్రోల్ ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనే ఒక మొబైల్ షాప్ ఓనర్ కి తెలివైన ఐడియా వచ్చింది. తన షాపులో 10 వేలకు పైగా విలువైన మొబైల్ ఫోన్ కొంటే లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తానని, దానితోపాటుగానే వంద రూపాయల మొబైల్ యాక్సెసరీస్ పై రెండు నిమ్మకాయలు ఫ్రీగా ఇస్తాం అంటూ ప్రకటనలు ఇచ్చాడు. అంతే, ఈ ప్రకటన అందరి దృష్టిని ఆకర్షించింది. అందనంత ఎత్తుకు కూర్చున్న నిమ్మకాయతో పాటుగా మండి పడుతున్న పెట్రోల్ కూడా అందరినీ మొబైల్ షాప్ వైపు ఆకర్షించింది. కస్టమర్ లతో పాటుగా మొబైల్ షాప్ ఓనర్ కూడా ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ఇంతకీ ఆ షాప్ ఎక్కడుంది అనుకుంటున్నారా?! ఎక్కడ ఈ ఆఫర్ ఉంది అని ఆలోచిస్తున్నారా!?
వారణాసిలోని మోబీ వరల్డ్ మొబైల్ షాప్ ఈ ఆఫర్ ని ప్రారంభించింది. 10 వేలు పెట్టి మొబైల్ ఫోన్ కొన్న వెంటనే ఒక లీటర్ పెట్రోల్ ఉచితంగా లభిస్తుంది. దీంతోపాటుగా మొబైల్ ఫోన్ కి సంబంధించి యాక్సెసరీస్ ఏమైనా తీసుకుంటే నిమ్మకాయలు కూడా ఉచితంగా ఇస్తారు. ఫోన్ కవర్లు, టెంపర్డ్ గ్లాసులు…ఇలా వంద రూపాయలకు పైగా విలువైన యాక్సెసరీలను కొనుగోలు చేస్తే వెంటనే కష్టమర్ చేతిలో రెండు నిమ్మకాయలను కూడా ఉచితంగా పెడుతుంది షాప్ యాజమాన్యం. ఈ ఆఫర్ కు సంబంధించి ప్రకటనలు, బోర్డులతో పాటు సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారడంతో మోబి వరల్డ్ మొబైల్ షాప్ కు కస్టమర్ల రాక పెరిగింది. దీంతో షాపు ఓనర్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.