బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట
ఎమ్మెల్సీ కవితకు ఈ నెల 26వ తేదీ వరకు సమన్లు జారీ చేయవద్దని ఈడీ అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 15 Sept 2023 3:45 PM ISTబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్సీ కవితకు ఈ నెల 26వ తేదీ వరకు సమన్లు జారీ చేయవద్దని ఈడీ అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
నళినీ చిదంబరం తరహాలోనే తమకూ ఊరట కల్పించాలని సుప్రీంకోర్టును ఎమ్మెల్సీ కవిత కోరారు. ఈ నేపథ్యంలో కవిత పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈడీ తరఫు న్యాయవాది స్పందన కోరింది. తమకు కూడా అభ్యంతరం లేదని అదనపు సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. దాంతో.. సెప్టెంబర్ 26వ తేదీ వరకు సమన్లు జారీ చేయొద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు గురువారం ఈడీ అధికారులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారమే ఈడీ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దాంతో.. ఈడీ సమన్లపై ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్, కవితలు సౌత్ గ్రూప్ ద్వారా ఆప్ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు చెల్లించి ఢిల్లీ లిక్కర్ స్కీమ్‌ను తమకు అనకూలంగా మార్చుకుని లబ్ధి పొందారని ఈడీ అభియోగిస్తోంది. ఈనేపథ్యంలో ఈడీ అధికారులు కవితకు పలుమార్లు సమన్లు జారీ చేశారు. కవిత కూడా ఇప్పటికే మూడు సార్లు విచారణను ఎదుర్కొన్నారు. ఆమెకు వ్యతిరేకంగా ఇంతవరకు ఎలాంటి ఆధారాలు చూపలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో మరోసారి నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ కక్ష సాధింపు చర్య ఉందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్సీ కవిత 16, 20, 21వ తేదీల్లో విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలోనే ఎమ్మెల్సీ కవిత మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50 కింద తనకు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో కేసు దాఖలు చేశారు. దర్యాప్తు సంస్థలు మహిళలను ఇంటివద్దే విచారించాలని, సమయపాలన పాటించాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ ఇంకా కొనసాగుతోంది. అయినా మళ్లీ నోటీసులు ఇవ్వడాన్ని ఎమ్మెల్సీ కవిత తప్పుబట్టారు. ఈ నెల 17న కేంద్రమంత్రి అమిత్‌షా రాష్ట్రానికి వస్తున్నారని.. రాజకీయంగా విమర్శలు చేసేందుకే నోటీసులు పంపారని ఆమె అన్నారు. పొలిటికల్ నోటీసులనీ.. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎమ్మెల్సీ కవిత చెప్పారు.