ఢిల్లీ లిక్కర్ కేసులో ఎట్టకేలకు కవితకు బెయిల్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు ఊరట లభించింది.
By Srikanth Gundamalla Published on 27 Aug 2024 1:29 PM ISTఢిల్లీ లిక్కర్ కేసులో ఎట్టకేలకు కవితకు బెయిల్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఆమెకు తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. కవిత, ఈడీ తరఫున వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు మార్చి 15వ తేదీన అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కవితను అరెస్ట్ చేసినట్లు అప్పట్లో ఈడీ ఉన్నతాధికారులు చెప్పారు. అరెస్ట్ వారెంట్‌తో వెళ్లిన ఈడీ అధికారులు తొలుత సోదాలు నిర్వహించి.. ఆ తర్వాత విచారించారు. వాంగ్మూలం తీసుకున్నారు. ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని.. అదుపులోకి తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత జైలులోనే ఉన్నారు. బెయిల్ కోసం అన్నివిధాలా ప్రయత్నించారు. కానీ.. న్యాయస్థానాలు బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూనే వచ్చాయి. కానీ.. సుప్రీంకోర్టు మంగళవారం ఎట్టకేలకు బెయిల్‌ను మంజూరు చేసింది.
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలు చేసిన నేపథ్యంలో నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది. నిందితురాలు మహిళ అనే విషయం కూడా దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇస్తున్నట్లు తెలిపింది. ఇక ఐదు నెలలు పాటు తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బయటకు రానున్నారు.