గెలుపు వాకిట చతికిలపడ్డ టీఆర్ఎస్.. దుబ్బాక బీజేపీదే..!
BJP Won In Dubbaka ByPoll. నరాలు తెగే ఉత్కంఠ కలిగించిన దుబ్బాక ఉప పోరులో బీజేపీ విజయం సాధించింది. ఆ పార్టీ
By Medi Samrat Published on 10 Nov 2020 10:28 AM GMT
నరాలు తెగే ఉత్కంఠ కలిగించిన దుబ్బాక ఉప పోరులో బీజేపీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు జయకేతనం ఎగురవేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతపై 1470 ఓట్ల మెజార్టీతో రఘునందన్‌రావు గెలుపొందారు. దీంతో కాషాయ పార్టీలో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ విజయంతో బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు.
తొలి రౌండ్ నుంచి కమలం-కారు మధ్య హోరాహోరీగా.. నువ్వానేనా అన్నట్టుగా సాగినా చివరాకరికి కమలాన్నే విజయం వరించింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు 62772 ఓట్లు రాగా.. టీఆర్‌ఎస్ అభ్యర్థి సుజాతకు 61302 ఓట్లు.. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డికి 21,819 ఓట్లు లభించాయి. మొత్తంగా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం టీ20 మ్యాచ్ ఫైనల్ పోరును తలపించింది.
ఇదిలావుంటే.. దుబ్బాక ఎన్నిక ఫలితాన్ని ఈసీ అధికారికంగా ధృవీకరించలేదు.. సీఈవో శశాంక్ గోయల్ స్పందిస్తూ.. పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు వచ్చాయని తెలిపారు. 21, 188 పోలింగ్ కేంద్రాల్లోని రిజల్జ్ రాలేదని.. వీవీ ప్యాట్లలోని స్లిప్పులు లెక్కిస్తామని.. అలాగే.. 136, 157/A పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ తర్వాత క్లియర్ చేయలేదని.. నిబంధనల ప్రకారం వాటి లెక్కింపు చేపడతామని.. అనంతరం ఎన్నికల తుది ఫలితాన్ని ప్రకటిస్తామని సీఈవో శశాంక్ గోయల్ అన్నారు.
దుబ్బాక అసెంబ్లీ ఫలితాల వివరాలు :
మొత్తం ఓటర్లు - 198807
పోలైన ఓట్లు - 164192
23 రౌండ్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత పార్టీల బలాబలాలు :
టీఆర్ఎస్ - 61302
బీజేపీ - 62772
కాంగ్రెస్ - 21819
నోటా -552
మెజారిటీ ఓట్లు 1470 (బీజేపీ)