లోక్‌సభ బరిలో తమిళిసై.. బీజేపీ మూడో జాబితాలో చోటు

తమిళిసైకి బీజేపీ విడుదల చేసిన మూడో విడత లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో అవకాశం ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on  21 March 2024 3:00 PM GMT
bjp, third list, lok sabha election, tamilisai ,

 లోక్‌సభ బరిలో తమిళిసై.. బీజేపీ మూడో జాబితాలో చోటు

తెలంగాణ గవర్నర్ పదవికి ఇటీవల తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె రాజీనామా తర్వాత తమిళనాడుకు వెళ్లిపోయారు. ఆమె వెళ్తూ వెళ్తూ ప్రజలకు సేవ చేయడం కోసమే రాజీనామా చేసినట్లు చెప్పారు. ఇక రాజకీయ వర్గాల్లో తమిళిసై బీజేపీ నుంచి లోక్‌సభ బరిలో దిగుతారనే ప్రచారం జరిగింది. తాజాగా దాన్ని నిజం చేసింది బీజేపీ అధిష్టానం. తమిళిసైకి బీజేపీ విడుదల చేసిన మూడో విడత లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో అవకాశం ఇచ్చారు.

తాజాగా బీజేపీ అధిష్టానం 9 మందితో కూడిన లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో తమిళిసై సౌందరరాజన్‌తో పాటుగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పేరు కూడా చేర్చారు. ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసిన బీజేపీ.. తాజాగా మూడో లిస్ట్‌ను రిలీజ్ చేసింది. ఎన్నికల సమరంలో ప్రత్యర్థుల కంటే ముందు వరుసలో దూసుకుపోతుంది. ఇక ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రులు, ఇతర కీలక నేతలు ఇప్పటికే దేశ వ్యాప్తంగా జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తున్నారు.

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై తమిళనాడులోని చెన్నై సౌత్‌ లోక్‌సభ నుంచి పోటీ చేయబోతున్నారు. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై కోయంబత్తూరు నుంచి లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇక చెన్నై సెంట్రల్‌ నుంచి వినోజ్‌ పి. సెల్వం పోటీ చేస్తున్నారు. వెల్లూర్ నుంచి ఏసీ షణ్ముగం, కృష్ణగిరి నుంచి సి.నరసింహన్, నీలగిరి నియోజకవర్గం నుంచి ఎల్‌ మురుగన్, పెరంబలూర్ నుంచి టీఆర్ పారివేందర్, తూత్తుకుడి నుంచి నైనార్ నాగేంద్రన్, కన్యాకుమారి నుంచి రాధాకృష్ణన్‌ బీజేపీ నుంచి లోక్‌సభ అభ్యర్థులుగా పోటీచేయనున్నారు.


Next Story