దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఫలితం కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. అయితే.. ఇప్పటి వరకు మూడు రౌండ్లలో జరిగిన కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ముందంజలో ఉన్నారు. కాగా టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెండో స్థానంలో ఉన్నారు.
దుబ్బాక ఉపఎన్నిక నాలుగో రౌండ్‌ల కౌంటింగ్ ముగిసే సరికి బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి రఘనందన్ రావు 2,684 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఇప్పటిదాకా బీజేపీకి 13,055.. టీఆర్‌ఎస్‌కి 10,371.. కాంగ్రెస్‌కి 2158 ఓట్లు లభించాయి. ఇదిలావుంటే.. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామంలో బీజేపీ 110 ఓట్ల ఆధిక్యం సాధించింది.
ఇదిలావుంటే.. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య ఆసక్తికర పోరు జరుగుతోందని బీజేపీ సీనియర్ నాయకుడు రాంమాధవ్ ట్వీట్ చేశారు. తమ పార్టీ ప్రస్తుతం ఆధిక్యంలో ఉందని, బీజేపీ అనూహ్య విజయం సాధించే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.