వేడుక ఏదైనా బిర్యానీ ఉండాల్సిందే బాసూ..!

బిర్యానీ అంటే ఒక వంటకం మాత్రమే కాదు.. కోట్ల మంది ప్రజల భావోద్వేగం.

By Srikanth Gundamalla  Published on  2 July 2023 4:15 PM IST
Biryani Day, Hyderabad, Hotels, Restaurants, Famous,

వేడుక ఏదైనా బిర్యానీ ఉండాల్సిందే బాసూ..!

భారత దేశంలో ఎన్నో రకాల వంటకాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రజల అలవాట్లకు అనుగుణంగా వండుకుంటారు. ఎక్కడైనా సరే బిర్యానీ మాత్రం ఉంటుంది. ఎందుకంటే బిర్యాని అంత ఫేమస్ మరి. బిర్యానీ అంటే ఒక వంటకం మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజల భావోద్వేగం. బిర్యానీల్లోనూ చాలా రకాలు ఉంటాయి. వెజ్, నాన్‌వెజ్‌లలోనూ ఉంటుంది. జూలై నెలలో మొదటి ఆదివారాన్ని ప్రపంచ బిర్యానీ దినోత్సవంగా జరుపుకొంటున్నారు. 2022 నుంచే ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఇది రెండో ఏడాది.

దావత్ ఏదైనా సరే బిర్యానీ మస్ట్‌. పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్‌మెంట్, బర్త్‌డే పార్టీ, మ్యారేజ్‌డే.. గెట్‌ టుగెదర్, మీటింగ్‌లు జరిగినా బిర్యానీ లేదా అంటారు. చివరకు దశదిన కర్మల్లోనూ బిర్యానీ వండుతున్నారు. బిర్యానీ లేకుండా ఏ కార్యక్రమాలు జరగడం లేదంటే నమ్మండి. ఇక బిర్యానీ అంటే హైదరాబాద్‌ ఫేమస్. ఒకప్పుడు బిర్యానీ కొన్ని పెద్ద హోటళ్లకే పరిమితం అయ్యింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చిన్న చిన్న హోటళ్లలోనూ బిర్యానీ ఐటమ్‌ మెన్యూలో మొదట్లో ఉంటుంది. కొన్ని చోట్ల ఈ బిర్యానీ రూ.500కు దొరికితే ఇక చిన్న హోటళ్లలో కేవలం రూ.100కే బిర్యానీ లభిస్తుంది. అయితే.. ధరను బట్టి టేస్ట్‌ కూడా మారుతుంది అనుకోండి. ధరలు వేర్వేరుగా ఉన్నా బిర్యానీ అంటే మాత్రం జనాలకు ఒక ఎమోషన్‌ అనే చెప్పాలి.

బిర్యానీకి ఎంతో క్రేజ్‌ ఉంది. ఫుడ్‌ డెలివరీ సంస్థల్లో రోజులో ఎక్కువగా డెలివరీ అయ్యే ఐటమ్ బిర్యానీనే. ప్రత్యేక రోజుల్లో అంటే డిసెంబర్ 31, జనవరి 1, హాలీడేస్‌లో అయితే దాదాపుగా రోజుకు లక్ష ఆర్డర్లు వస్తుంటాయట. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు బిర్యానీకి ఎంత క్రేజ్‌ ఉందనేది. అయితే.. బిర్యానీ వండటం కొద్దిగా లాంగ్‌ ప్రాసెస్‌. అందుకే జనాలు ఎక్కువగా రెస్టారెంట్లలో లభించే బిర్యానీలనే తీసుకెళ్తారు.

భోజన ప్రియులను రకరకాల పేర్లతో రెస్టారెంట్లు, హోటళ్లు ఆకట్టుకుంటున్నాయి. హండీ నుంచి మండీ వరకు ఎన్నో రకాల బిర్యానీలను ప్రిపేర్‌ చేస్తున్నాయి. వెజ్ కావాలనుకునే వారికి వెజ్‌ బిర్యానీని కూడా సర్వ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ దమ్‌ బిర్యానీకి చాలా పేరుంది. విదేశాల్లోని వారు కూడా దమ్‌ బిర్యానీని ఎంతో లైక్‌ చేస్తారు. కొందరైతే హైదరాబాద్‌ వచ్చారంటే చాలు.. దమ్‌ బిర్యానీ తినకుండా వెళ్లరు. హైదరాబాద్‌ అంటేనే దమ్‌ బిర్యానీ అన్నట్లుగా తయారవుతోంది. మండీ అంటూ పెద్ద ప్లేట్‌లో ఒకేసారి నలుగురు, ఐదుగురు.. ఇంకా ఎక్కువ సంఖ్యలో కూడా కూర్చొని తినేలా బిర్యానీ అమ్ముతుంటారు. అరేబియన్ మండీ, హండీ, ధమ్‌కీ బిర్యానీ, జాఫ్రానీ, రెడ్‌ బకెట్‌, నిజాం బిర్యారీ, తహారీ బిర్యానీ, కశ్మీరి బిర్యానీ, నల్లీగోష్‌ బిర్యానీ, కీమా బిర్యానీ, చికెన్ బిర్యానీలు మాంసాహారులను ఆకట్టుకుంటున్నాయి. వెజ్‌లో అయితే వెజ్‌ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, మష్రూం బిర్యానీ, అవకాయ బిర్యానీ ఇలా ఇంకొన్ని అందుబాటులో ఉన్నాయి.

హైదరాబాద్‌ బిర్యానీ ఒక్కటే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రాంతాల్లోనూ బిర్యానీలు ఫేమస్‌ అవుతున్నాయి. లక్నో బిర్యానీ, కోల్‌కతా బిర్యానీ, కేరళలోని మలబార్ బిర్యానీ ఇలా ఆయా ప్రాంతాల్లో వారి టేస్ట్‌కి తగ్గట్లుగా బిర్యానీలు అందుబాటులో ఉంటున్నాయి. ఇక ఆదివారం బిర్యానీ దినోత్సవం అంటున్నారు. ఇవాళ మరి బిర్యానీ లాగించాల్సిందే అని చాలా మంది అంటున్నారు.

Next Story