రాష్ట్ర ప్రభుత్వాలను బర్డ్‌ఫ్లూపై అప్రమత్తం చేస్తున్న కేంద్రం
ఈ ఏడాది బర్డ్‌ఫ్లూ లక్షణాలు పలు రాష్ట్రాల్లో బయటపడింది.
By Srikanth Gundamalla Published on 1 Jun 2024 1:01 AM GMTరాష్ట్ర ప్రభుత్వాలను బర్డ్‌ఫ్లూపై అప్రమత్తం చేస్తున్న కేంద్రం
ఈ ఏడాది బర్డ్‌ఫ్లూ లక్షణాలు పలు రాష్ట్రాల్లో బయటపడింది. ఇప్పటి వరకు నాలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ లక్షణాలను అధికారులు గుర్తించారు. ఏపీలోని నెల్లూరులో కూడా బర్డ్‌ఫ్లూతో పౌల్ట్రీలో మరణాలు సంభవించాయి. ఇక మహారాష్ట్రలోని నాగపూర్, కేరళలోని అలప్పుజ, కొట్టాయం, జార్ఖండ్‌లోని రాంచీ ప్రాంతాల్లో బర్డ్‌ఫ్లూను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం వివరించింది. ఈ నేపథ్యంలోనే పౌల్ట్రీలు, ఇతర పక్షులకు సంబంధించి అసాధారణ రణాలు సంభవిస్తే అలాంటి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచిస్తోంది. ఇక పౌల్ట్రీల్లో, ఇతర పక్షులు అసాధారణంగా చనిపోతే వెంటనే పశుసంవర్ధక శాఖకు తెలపాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సెంట్రల్ గవర్నమెంట్ తెలిపింది.
బర్డ్‌ఫ్లూ గురించి మనందరికీ తెలిసిందే. గతంలో కూడా ఈ వైరస్ పక్షుల నుంచి మానవులకూ సోకింది. పలువురు దీని వల్ల తీవ్ర అస్వస్థతకు గురైతే.. మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇక పౌల్ట్రీల్లో కోళ్లు అయితే కొన్ని వందలు, వేలల్లో చనిపోయాయి. దాంతో.. పౌల్ట్రీ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతుంటారు. అయితే.. పక్షుల నుంచి అత్యంత వేగంగా బర్డ్‌ఫ్లూ మానవులకు సోకుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు అవసరమైన అన్ని చర్యలు ముందుగానే తీసుకోవడం మంచిదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. యాంటీవైరల్ ఔషధాలు, పీపీఈ కిట్లు, మాస్క్‌లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. ఇన్‌ఫెక్షన్ సోకిన పక్షులను వధించే వారితో పాటు పర్యవేక్షకుల నుంచి క్రమంగా నమూనాలు తీసుకుని H5N1 పరీక్షలు నిర్వహించాలని చెప్పింది. ఒకవేళ ఎవరికైనా బర్డ్‌ఫ్లూ లక్షణాలు ఉంటే వారిని ఆస్పత్రుల్లో చేర్పించి వెంటనే తగిన చికిత్సను అందించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది.