మద్యం తాగేవారు మహాపాపులు, వారు భారతీయులు కాదు : బీహార్ సీయం
By - Nellutla Kavitha | Published on 31 March 2022 1:25 PM GMTమద్యం తాగే వారంతా మహాపాపులు, వారసలు భారతీయులే కాదు అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు బీహార్ సీఎం నితీష్ కుమార్. మద్యం తాగే వారికి అసలు బాధ్యతలే ఉండవని, కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి గురించి ఎందుకు పట్టించుకోవాలి, పరిహారం ఎందుకు ప్రకటించాలని వ్యాఖ్యానించారు బీహార్ సీఎం. మద్యం తాగేవారు జాతిపిత మహాత్మా గాంధీ ఆదర్శాలకు తూట్లు పొడుస్తున్నారని, అటువంటి వారి గురించి ఎందుకు పట్టించుకోవాలి అంటూ ప్రశ్నించారు. గాంధీ మద్యపానాన్ని వ్యతిరేకించారని, మద్యం తాగే వాళ్లను తాను భారతీయులుగా గుర్తించని అసెంబ్లీలో ప్రకటించారు బీహార్ సీఎం నితీష్ కుమార్.
బీహార్ లో మద్య నిషేధం అమల్లో ఉన్నా తాగుతున్న వారంతా మహాపాపులేనని అభివర్ణించిన నితీష్ కుమార్, కల్తీ మద్యం తాగడం వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు ఎటువంటి సహాయం చేయనని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన హోలీ వేడుకల్లో కల్తీ మద్యం తాగి రాష్ట్రంలో 37 మంది చనిపోయారని, అయినప్పటికీ వారికి పరిహారం ఇవ్వమని అన్నారు నితీష్ కుమార్. బీహార్ లో సంపూర్ణ మద్యపాన నిషేధ చట్టం 2016 నుంచి అమల్లో ఉంది. దానికి కొన్ని సవరణలు చేస్తూ నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది. మొదటిసారి తాగి పట్టుబడ్డ వారికి జరిమానా విధించి వదిలేయాలని సవరణ చేశారు.
మండలి లో చర్చ సందర్భంగా రాష్ట్రీయ జనతా దళ్ కి చెందిన ఎమ్మెల్సీ తాగినందుకు జైలు జీవితం అనుభవిస్తున్న వారి మీద కేసులను కొట్టేసి, జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే సీఎం నితీష్ కుమార్ మాత్రం వారిని మహాపాపులుగా అభివర్ణిస్తూ, అసమర్ధులు అయినటువంటి వ్యక్తులుగా పేర్కొన్నారు. చట్ట సవరణలు తర్వాత మందు వ్యాపారుల మీద కూడా కఠినమైన శిక్షలు ఉంటాయని సీఎం ప్రకటించారు.