బిగ్‌బాస్ రియాలిటీ షోకు సెన్సార్ ఉండాల్సిందే: ఏపీ హైకోర్టు
బిగ్‌బాస్ షోకు సెన్సార్‌షిప్ అవసరమే అని తేల్చి చెప్పింది ఏపీ హైకోర్టు.
By Srikanth Gundamalla Published on 27 July 2023 9:37 AM ISTబిగ్‌బాస్ రియాలిటీ షోకు సెన్సార్ ఉండాల్సిందే: ఏపీ హైకోర్టు
టీవీ ప్రసారాలకు సెన్సార్ షిప్ ఉండాలని ఏపీ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రసారం అవుతోన్న రియాలిటీ షో బిగ్‌బాస్‌ను ఎంతో మంది ఫాలో అవుతారు. అలాంటి షోలో అశ్లీలత ఎక్కువగా ఉందంటూ ఫిర్యాదులు నిత్యం వస్తున్నాయి. ఈ క్రమంలోనే అశ్లీలను ఆపాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి. ఆయన వేసిన రెండు ప్రజాహిత వ్యాజ్యాలపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.
సెన్సార్ లేకుండా బిగ్‌బాస్ షోను ప్రసారం చేస్తున్నారని.. ఇలాంటి షోలను రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున వరకు మాత్రమే ప్రసారం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి. ఆయన కేతిరెడ్డి తరఫున హైకోర్టులో గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రతిగా ఎండోమోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తరఫు సీనియర్ లాయర్ సీసీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రస్తుతం ఇంకా బిగ్‌బాస్ షో ప్రసారం కావడం లేదన్నారు. ఇలాంటి సమయంలో విచారణ అవసరం లేదని చెప్పారు. షో ప్రసారం మొదలు అయ్యాక.. పిటిషనర్‌కు పిల్ వేసుకునేందుకు స్వేచ్ఛ ఇవ్వాలని మోహన్‌రెడ్డి వాదించారు. బిగ్‌బాస్ షో ప్రసారానికి ముందు సెన్సార్‌షిప్ విధానం లేదని.. షో చూడటం ఇష్టం లేనివారు చానల్ మార్చుకోవచ్చని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
బిగ్‌బాస్ షోకు సెన్సార్‌షిప్ అవసరమే అని తేల్చి చెప్పింది ఏపీ హైకోర్టు. షో ప్రసారం అయ్యాక ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటే ఏం ప్రయోజనం ఉంటుందని నిలదీసింది. చానెళ్లు ఇలా అశ్లీల కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నా పర్యవేక్షించకూడదా? అని ప్రశ్నించింది. నైతిక విలువలు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. షో ప్రసారానికి ముందే సెన్సార్ విషయంలో కేంద్రానికి సూచనలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, సదురు చానెల్‌తో పాటు ఇతరులనూ ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. కాగా.. బిగ్‌బాస్ షోపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. సెన్సార్ పట్టించుకోవడం లేదని, బూతులు, అశ్లీలంగా ఉంటోందని అంటున్నారు.