బిగ్‌బాస్-7 ఫైనల్ దాడి ఘటనలో మరో 16 మంది అరెస్ట్
బిగ్‌బాస్ సీజన్-7 ఫైనల్ తర్వాత కొందరు ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాలపై దాడి చేశారు.
By Srikanth Gundamalla Published on 21 Dec 2023 11:24 AM GMTబిగ్‌బాస్-7 ఫైనల్ దాడి ఘటనలో మరో 16 మంది అరెస్ట్
బిగ్‌బాస్ షో దేశవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకున్న రియాలిటీ గేమ్ షో. ఈ కార్యక్రమానికి ఎంత ఆదరణ ఉంటుందో.. అలాగే విమర్శలు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. ఈ క్రమంలో ఇటీవల తెలుగు బిగ్‌బాస్ సీజన్-7 ఫైనల్ కార్యక్రమం తర్వాత హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఫైనల్ తర్వాత కొందరు దాడి చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబందించి రోజుకు రోజుకు వివాదం ముదురుతూనే ఉంది. దీనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అంతేకాదు. ఇదే కేసులో బిగ్‌బాస్ సీజన్-7 విన్నర్ ప్రశాంత్ ఏ1గా, మనోహర్ ఏ2గా, స్నేహితుడు వినయ్ ఏ3గా చేర్చారు పోలీసులు. పల్లవి ప్రశాంత్‌తో పాటు.. అతని సోదరుడు మహావీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం ఇద్దరికీ నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
అయితే.. ఇదే సంఘటనలో పోలీసులు తాజాగా మరో 16 మందిని అరెస్ట్ చేశారు. బిగ్‌బాస్ సీజన్-7 ఫైనల్ తర్వాత కొందరు ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాలపై దాడి చేశారు. ఈ ఘటనలోనే 16 మందిని గుర్తించిన జూబ్లీహిల్స్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వీరిలో 12 మంది మేజర్లు కాగా.. నలుగురు మైనర్లు ఉన్నారు.
ఇక బిగ్‌బాస్-7 ఫైనల్ తర్వాత విన్నర్ ప్రశాంత్ బయటకు రాగా.. అభిమానులు భారీగా స్వాగతం పలికారు. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్ సైతం బయటకు రాగా.. ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అమర్‌దీప్‌పై పలువురు రాళ్లు విసిరే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనలో అతడి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. మరో కంటెస్టెంట్ అశ్విని కారు అద్దాలను కూడా దుండగులు ధ్వంసం చేశారు. అలాగే రోడ్డుపై వెళ్తున్న ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలను పగలగొట్లారు. పోలీసు కారు అద్దంతో పాటు.. బెటాలియన్ బస్సు అద్దాన్నీ ధ్వంసం చేశారు. దీంతో.. ఈసంఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్‌లు చేశారు.