బ్యాంకు ఉద్యోగాల పేరిట భారీ టోకరా.. ఏపీ, తెలంగాణలో 220 మంది బాధితులు

మోసాలను పోలీసులు ఎన్ని విధాలుగా అరికట్టినా.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి.

By సుభాష్  Published on  10 Nov 2020 4:26 AM GMT
బ్యాంకు ఉద్యోగాల పేరిట భారీ టోకరా.. ఏపీ, తెలంగాణలో 220 మంది బాధితులు

మోసాలను పోలీసులు ఎన్ని విధాలుగా అరికట్టినా.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగాల పేరుతో ప్రజలను మోసగిస్తూ నిలువునా దోచుకుంటున్నారు. తాజాగా ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి కేంద్రంగా కో ఆపరేటివ్‌ సొసైటీ పేరుతో బ్యాంకు ప్రారంభించామని, అందులో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెబుతూ రూ. లక్షల్లో నగదు తీసుకుని తమను మోసం చేశారంటూ బధితురాలు సోమవారం గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై దర్యాప్తునకు అధికారులను ఆదేశించారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలి పెంచుపేటలో ఒక కోఆపరేటివ్‌ సొసైటీ పేరిట బ్యాంకు ప్రారంభించామని, ఆంధ్రా, తెలంగాణలో ఉద్యోగాలు ఉన్నాయంటూ చైర్మన్‌, డైరెక్టర్లంటూ పది మంది సభ్యులు నిరుద్యోగ యువకులకు మాయమాటలు చెబుతూ బ్యాంకు మేనేజర్‌, సహాయ మేనేజర్‌ ఉద్యోగాలకు ఒక్కొక్కరి నుంచి రూ.8 నుంచి 10 లక్షల వరకు వసూలు చేయాలని పలువురు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అలాగే 2018లో నగదు వసూలు చేసి నియామక పత్రాలు ఇచ్చారని, కొంత మందికి ఒక నెల జీతం ఇచ్చి తాము చెప్పినప్పుడు ఉద్యోగానికి రావాలన్నారు. రెండు రాష్ట్రాల్లో సుమారు 220 మందిని మోసం చేసి మూడు కోట్ల రూపాయల వరకు వసూలు చేసుకుని బోర్డు తిప్పేశారని తెలిపారు. ఇటీవల తెనాలిలోని ప్రధాన కార్యాలయం ఖాళీ చేశారని, వారికి ఫోన్‌ చేసి అడిగినా, డబ్బులు అడిగినా చంపేస్తామని బెదిరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరారు.

Next Story