TTD చైర్మన్ ఎవరు? YCP శ్రేణులు హిందువుల్లా ఆలోచించాలి: బండి సంజయ్
టీటీడీ చైర్మన్ తీరుపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ కూడా తీవ్రంగా స్పందించారు.
By Srikanth Gundamalla Published on 22 Aug 2023 5:32 PM ISTTTD చైర్మన్ ఎవరు? YCP శ్రేణులు హిందువుల్లా ఆలోచించాలి:బండి సంజయ్
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల చిరుత దాడుల్లో ఒక చిన్నారి మృతిచెందగా.. అంతకు ముందే ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. చిరుతలు, ఇతర జంతువులు కూడా సంచరిస్తుండటంతో భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. టీటీడీ అప్రమత్తమై నడక మార్గంలో ఎన్ని చర్యలు చేపట్టినా జంతులు సంచారం ఆందోళన కలిగిస్తూనే ఉంది. అయితే.. టీటీడీ తాజాగా కొత్త ఆలోచన చేసింది.. నడకమార్గంలో వెళ్ళే భక్తులకు చేతికర్ర ఇస్తోంది. దాంతో.. జంతువుల దాడి నుంచి తప్పించుకోవచ్చని చెబుతోంది. టీటీడీ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు తలెత్తాయి. చేతికర్ర ఇచ్చి చేతులు దులుపేసుకుంటారా? అంటూ ఆరోపణలు వచ్చాయి. భక్తుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని.. సరైన నిర్ణయాలు తీసుకుని భద్రత కల్పించాలని విన్నపాలు వచ్చాయి.
అయితే.. ఇదే విషయంపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ కూడా తీవ్రంగా స్పందించారు. టీటీడీ చైర్మన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేసిన బండి సంజయ్.. ఏపీలో హిందూ మతంపై దాడి జరుగుతోందని విమర్శించారు. తిరుమలలో భక్తులకు భద్రత లేకుండా పోయిందని.. తిరుమలకు రాకుండా చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. భక్తులను కాపాడలేక వారి చేతికి కర్రలిస్తారా అని బండి సంజయ్ నిలదీశారు. వెంకటేశ్వర స్వామిని అవమానిస్తే పుట్టగతులుండవనే సంగతి గుర్తుంచుకోవాలని హెచ్చరించారు బండి సంజయ్. ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు. కొత్త చైర్మన్ ఎవరండీ అంటూ ప్రశ్నించారు. ఆయన బిడ్డ పెళ్లి ఏ ఆచార పద్ధతిలో చేశారని ప్రశ్నించారు. తాను నాస్తికుడంటూ గతంలో చెప్పిన విషయం మర్చిపోయారా అన్నారు బండి సంజయ్. భూమన సిగ్గు లేకుండా తిరుమలలో అడవులున్న విషయమే తెలియదని అంటున్నారట.. మరి ఆయనకు పుష్ప సినిమా చూపించాలేమో అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలకు బండి సంజయ్ ఒక అప్పీల్ కూడా చేశారు. వైసీపీ శ్రేణులు హిందువులలాగా ఆలోచించాలని కోరారు. ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని.. దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని అన్నారు. ఒక మతానికే కొమ్ము కాస్తూ.. ఆ మతమే అధికారం చెలాయించాలని చూస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. వాటిని సహించొద్దని.. జెండాలు, అజెండాలను పక్కనపెట్టి సంతూష్టీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు బండి సంజయ్. బీజేపీ నుంచి జాతీయ హోదాలో పదవి పొందిన తర్వాత తొలిసారి ఏపీలో వైసీపీని టార్గెట్ చేస్తూ బండి సంజయ్ విమర్శలు చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై వైసీపీ ఎలా సమాధానం ఇస్తుందో చూడాలి. ఇక తిరుమలలో నడక మార్గం మెట్లకు ఇరువైపులా కంచె ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది. టీటీడీ చైర్మన్ కూడా దానికి సిద్ధంగానే ఉన్నామన్నారు.. కానీ అటవీఅధికారుల నిర్ణయం తెలుసుకోవాలని చెప్పారు. కంచె ఏర్పాటు చేయడం ద్వారా జంతువులు నడకమార్గంలోకి వచ్చే అవకాశం ఉండదని నిపుణులు కూడా చెబుతున్నారు.