రేపు హైదరాబాద్‌లో ఆటోల బంద్
హైదరాబాద్ నగరంలో ఫిబ్రవరి 16న ఆటోల బంద్ కొనసాగనుంది. ఆటోడ్రైవర్ల సంఘాలు బంద్ కు పిలుపును ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 15 Feb 2024 2:00 PM GMTరేపు హైదరాబాద్‌లో ఆటోల బంద్
హైదరాబాద్ నగరంలో ఫిబ్రవరి 16న ఆటోల బంద్ కొనసాగనుంది. ఆటోడ్రైవర్ల సంఘాలు బంద్ కు పిలుపును ఇచ్చారు. మహాలక్ష్మీ పథకంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని, తెలంగాణలోని ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని గత కొన్ని రోజులుగా నిరసన తెలుపుతూ ఉన్నారు. వారి డిమాండ్లలో భాగంగా రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఆటో డ్రైవర్లు బంద్ కు పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 15 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఆటోబంద్ నిర్వహించనున్నట్లు టీఏటీయూ ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య తెలిపారు. ఉప్పల్ మల్లాపూర్లో ‘ఆటోబంద్’ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. హైదరాబాద్ లో 16న ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ణాన కేంద్రం నుంచి నారాయణగూడ చౌరస్తా వరకు భారీ ఆటోర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు యాత్రపై తెలంగాణలోని పలువురు ఆటో డ్రైవర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఉపాధి కోల్పోయామని బాధలో ఆటోరిక్షా డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారనే వార్తలు కూడా వచ్చాయి.