నాగార్జునసాగర్ నుంచి నీరు విడుదల చేసిన ఏపీ అధికారులు
ఏపీ అధికారులు పంతం నెగ్గించుకుని నాగార్జున సాగర్ నుంచి ఏపీకి నీరు విడుదల చేశారు.
By Srikanth Gundamalla Published on 30 Nov 2023 12:35 PM ISTనాగార్జునసాగర్ నుంచి నీరు విడుదల చేసిన ఏపీ అధికారులు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ హడావుడి ఒక వైపు ఉంటే.. మరోవైపు నాగార్జునసాగర్ ప్రాజెక్టు దగ్గర బుధవారం నుంచి ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. నీటి విషయంలో ప్రాజెక్టు వద్ద ఏపీ, తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. ఏపీ అధికారులు పంతం నెగ్గించుకుని నాగార్జున సాగర్ నుంచి ఏపీకి నీరు విడుదల చేశారు. సాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు నీటిని విడుదల చేశారు. ఇంగోలు చీఫ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఏపీ తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నీటిని విడుదల చేస్తున్నట్లు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.
ఏపీ అధికారులు నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయడంపై తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందించారు. కృష్ణా జలాల విషయంలో కేంద్రం సరైన వైఖరి తీసుకుని.. ఎవరి వాటా ఎంతో తేల్చకపోతే గొడవలు సద్దుమణగవు అని చెప్పారు. తెలంగాణవాటాలో ఒక్క చుక్క నీటిని కూడా అటువైపు వెళ్లనివ్వమని చెప్పారు. ఇదే అంశంపై స్పందించిన మంత్రి హరీశ్‌రావు.. పోలింగ్ అయిన తర్వాత మాట్లాడతానని అన్నారు.
మరోవైపు సాగర్ నుంచి నీటి విడుదలపై తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ సీఎం.. పక్క రాష్ట్ర సీఎంతో కుమ్మక్కు అయ్యారని బండి సంజయ్ అన్నారు. ఓడిపోతామని తెలిసే గొడవలకు తెరలేపుతున్నారని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తెలుగు ప్రజానీకానికి ద్రోహం చేయడం కోసమే అటు ఏపీ సీఎం, ఇటు తెలంగాణ సీఎం నాగార్జునసాగర్‌లో గొడవ సృష్టించారని సీపీఐ నేత నారాయణ అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.