అమెరికాలో విషాదం, సరస్సులోపడి ఇద్దరు తెలుగు చిన్నారులు మృతి

అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. ఓ సరస్సులో మునిగిన ఇద్దరు తెలుగు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

By Srikanth Gundamalla  Published on  10 Sept 2024 7:53 AM IST
అమెరికాలో విషాదం, సరస్సులోపడి ఇద్దరు తెలుగు చిన్నారులు మృతి

అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. ఓ సరస్సులో మునిగిన ఇద్దరు తెలుగు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గత శనివారం ఈ సంఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్‌ లాంగ్ ఐలాండ్‌లోని హోల్ట్స్‌ విల్లేలోని ఓ అపార్ట్‌మెంట్‌లో డేవిడ్, సుధా గాలి అనేతెలుగు దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రూత్‌ ఎవాంజెలిన్ గాలి (4), సెలాహ్‌ గ్రేస్‌ గాలి(2) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే.. శనివారం ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ అపార్ట్‌మెంట్‌ నుంచి బయటకు వెళ్లారు. వారు బయటకు వెళ్లిన విషయాన్ని ఇంట్లో ఉన్న తల్లి గమనించలేదు.

కాసేపటికే చూసుకున్న తల్లి చుట్టుపక్కల మొత్తం వెతికింది. కానీ పిల్లల ఆచూకీ కనిపించలేదు. దాంతో.. వెంటనే అప్రమత్తం అయ్యారు. 911కి కాల్‌ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పిల్లల ఆచూకీ కోసం వెతికారు. రెస్క్యూ సిబ్బందితో అక్కడి చేరుకున్నారు. దంపతులు నివాసం ఉంటోన్న అపార్ట్‌మెంట్‌ చుట్టుపక్కల చూశారు.. సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే.. చిన్నారులు అక్కడ దగ్గరే ఉన్న సరస్సు వైపు వెళ్తున్నట్లు గమనించారు. వెంటనే వారి కోసం సరస్సులో వెతికారు. వారి మృతదేహాలను బయటకు తీశారు. ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయారని వైద్యులు తెలిపారు. ఇద్దరు పిల్లలు చనిపోవడంతో తల్లి గుండె పగిలేలా ఏడిచింది. మరోవైపు చిన్నారుల తండ్రి వీసా సమస్య కారణంగా స్వదేశంలోనే ఉండిపోయాడని తెలిసింది.

Next Story