అమెరికాలో 21 మంది భారతీయ విద్యార్థులపై నిషేధం
దాదాపు 21 మంది విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరిగి భారత్‌కు పంపారు.
By Srikanth Gundamalla Published on 17 Aug 2023 11:09 AM GMTఅమెరికాలో 21 మంది భారతీయ విద్యార్థులపై నిషేధం
విదేశాల్లో చదివాలని చాలా మంది యువత కలలు కంటుంటారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి పిల్లలను చదువుల కోసం విదేశాలకు పంపిస్తారు. అయితే.. ఇలా విదేశాలకు వెళ్లే వారికి అమెరికా కేరాఫ్. ఆ దేశానికి వెళ్లేందుకు వీసా నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఒకసారి డిపోర్ట్ చేస్తే.. ఐదేళ్ల పాటు అమెరికాలో అడుగుపెట్టే అవకాశం కూడా ఉండదు. ఇలాంటి చేదు అనుభవమే పలువురు భారతీయ విద్యార్థులకు ఎదురైంది. దాదాపు 21 మంది విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరిగి భారత్‌కు పంపారు.
ఎన్నో ఆశలతో అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుంటామని.. అన్ని ఓకే అయిపోయాయని అక్కడ అడుగుపెట్టిన భారతీయ విద్యార్థులకు చుక్కెదురైంది. పలు యూనివర్సిటీల్లో చదువుకునేందుకు అమెరికాకు 21 మంది విద్యార్థులు వెళ్లగా.. సరైన పత్రాలు లేవంటూ వారికి అనుమతి నిరాకరించారు ఇమ్మిగ్రేషన్ అధికారులు. వీసా ప్రక్రియలను పూర్తి చేసినా.. ఆయా విశ్వవిద్యాలయాల నుంచి అడ్మిషన్లు పొందినా అమెరికాలో ఉండేందుకు అధికారులు నిరకారించారు. మెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేసి అధికారులు 21 మంది భారతీయ విద్యార్థులను భారత్‌కు పంపించారు.
అట్లాంట, శాన్‌ఫ్రాన్సిస్కో, షికాగోలో చదువుకోవాలనుకున్న 21 మంది భారతీయ విద్యార్థులకు ఈ పరిస్థితి ఎదురైంది. వారిని అక్కడి అధికారులు ఎయిర్‌ఇండియా విమానంలో భారత్‌కు పంపేశారు. ఆయా విద్యార్థులు అమెరికాలో ఇప్పట్లో ప్రవేశించకుండా డిపోర్ట్ చేశారు. అంటే ఐదేళ్ల పాటు ఈ 21 మంది విద్యార్థులు మళ్లీ అమెరికాలో అడుగుపెట్టకుండా చేశారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్టన్లు తెలుస్తోంది. లక్షలు ఖర్చుపెట్టి పిల్లలను అమెరికా పంపిస్తే.. తిరిగి రావడంతో ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
అయితే.. సరైన కారణాలు చెప్పకుండా డిపోర్ట్ చేశారని కొందరు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ చెకింగ్ పేరుతో ఇరుకు గదుల్లో పెట్టి నిర్బంధించారని వాపోయారు. ఎవరైనా ఎదురించి వాదిస్తే వారికి జైలు శిక్ష పడుతుందని బెదిరించారని బాధితులు చెబుతున్నారు. దాదాపు 16 గంటల పాటు తల్లిదండ్రులతో కూడా మాట్లాడనివ్వలేదని చెప్పారు. తమ సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను కూడా సీజ్ చేశారని భారతీయ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించాలని.. ఈ విషయంపై చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.