అమెరికాలో కాల్పుల కలకలం, తెలుగు వైద్యుడు మృతి
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి.
By Srikanth Gundamalla Published on 25 Aug 2024 12:00 PM ISTఅమెరికాలో కాల్పుల కలకలం, తెలుగు వైద్యుడు మృతి
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఈ సంఘటనలో తెలుగు వైద్యుడు ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం సాయంత్రం ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో డాక్టర్ పేరంశెట్టి రమేశ్ బాబు (64) అనే వ్యక్తి చనిపోయాడు. మృతుడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాగా తెలిసింది.
తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు గ్రామానికి చెందిన డాక్టర్ పేరంశెట్టి రమేశ్‌బాబు (64) అమెరికాలో నివాసం ఉంటున్నాడు. అలబామా రాష్ట్రంలోని టస్కలునా ప్రాంతంలో నివాసం ఉంటూ.. వైద్యుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన పలుచోట్ల ఆస్పత్రులు నిర్మించి ఎందరికో ఉపాధి కల్పిస్తున్నాడు. అయితే.. డాక్టర్ రమేశ్ బాబు సేవలకు గుర్తింపుగా అక్కడి ఓ వీధికి ఆయన పేరు పెట్టడం కూడా విశేషం.ప్రజలకు విశేష సేవలకు అందించిన వ్యక్తి చనిపోవడం విషాదాన్ని నింపింది.
కాగా.. డాక్టర్ రమేశ్‌బాబు తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. జమైకాలో ఎంఎస్ పూర్తి చేశాడు. ఆ తర్వాత అమెరికాలోనే వైద్యుడిగా స్థిరపడ్డారు. కరోనా సమయంలో ప్రపంచ దేశాలు వణికిపోతుంటే.. రమేశ్ బాబు మాత్రం విశేష సేవలందించారు. ఆ తర్వాత పలు పురస్కారాలను అందుకున్నారు. అమెరికాలో సెటిల్ అయినప్పటికీ తన స్వగ్రామాన్ని మర్చిపోలేదు. గ్రామ అభివృద్ధిలో తోడ్పాలు అందించారు. ఆయన చదువుకున్న పాఠశాల కోసం ఏకంగా రూ.14 లక్షల విరాళం అందజేశారు. అలాగే మేనకూరు గ్రామంలో పలు కార్యక్రమాల కోసం విరాళాలు అందించారు.