అమెరికాలో రోడ్డుప్రమాదం, ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టింది.
By Srikanth Gundamalla Published on 22 May 2024 3:48 PM ISTఅమెరికాలో రోడ్డుప్రమాదం, ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టింది. కారు వేగంగా వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా..వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారు భారత సంతతికి చెందిన శ్రియా అవసరాల, అన్వీ వర్మ, ఆర్యన్ జోషిగా పోలీసులు గుర్తించారు. ఇక గాయపడ్డ వారి వివరాలను కూడా పోలీసులు వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు రిత్వాక్ సోమేపల్లి, మహ్మద్ లియాఖత్‌గా తెలిపారు. కాగా.. ఈ రోడ్డు ప్రమాదం మే 14వ తేదీన జరిగింది. అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పింది. డ్రైవర్ కూడా కారును కంట్రోల్ చేయలేకపోయాడు. దాంతో.. వేగంగా వచ్చిన ఆ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ క్రమంలోనే కారులో ఉన్న శ్రియా అవసరాల, అన్వీశర్మకు తీవ్ర గాయాలు అయ్యి స్పాట్‌లోనే చనిపోయారు. ఆర్యన్ జోషి నార్త్ ఫుల్టన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు వెల్లడించారు. ఇక చనిపోయినవారంతా కూడా 18 ఏళ్ల లోపు వారే నని తెలిసింది.
శ్రియా అవసరాల, అన్వీవర్మ జార్జియా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు. ఇక మహ్మద్, ఆర్యన్ జోషి ఆల్ఫారెట్టా హైస్కూల్‌లో వీరికి సీనియర్లుగా తెలిసింది. కాగా.. ఒకే ప్రమాదంలో ముగ్గురు భారత సంతతికి చెందిన విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. మృతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.