ఆలిండియా మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీ బీహార్ ఎన్నికల్లో తన సత్తా చాటింది. కౌంటింగ్ మొదలైనప్పటి నుండి నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చింది ఎంఐఎం. ఆఖర్లో ఐదో స్థానంలో కూడా ఆధిక్యంలోకి వచ్చింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఐదు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. అమౌర్, కోచధామన్, బైసీ, బహదూర్ గంజ్, జోకిహట్ నియోజకవర్గాల్లో గెలిచిందని అక్బరుద్దీన్ ఒవైసీ చెప్పుకొచ్చారు. మరికొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చినట్లు సమాచారం. ఏ పార్టీ మద్దతు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగి ఎంఐఎం విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఎంఐఎం పార్టీలో నూతన ఉత్తేజం నిండింది. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఎంఐఐకు బాగా ఓట్లు పడ్డాయని చెబుతున్నారు.
243 స్ధానాలున్న బీహార్ అసెంబ్లీలో అధికారం దక్కాలంటే అవసరమైన మేజిక్ ఫిగర్ 122 స్ధానాలను దక్కించుకునే దిశగా ఎన్డీయే కూటమి సాగుతోంది. బీహార్‌లో అర్ధరాత్రి దాటేవరకూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో పూర్తి ఫలితాల వెల్లడవ్వడానికి చాలా సమయం పట్టనుంది.