అభిలాష బరాక్ - భారత తొలి యుధ్ద విమాన మహిళా పైలట్

By -  Nellutla Kavitha |  Published on  26 May 2022 9:20 AM GMT
అభిలాష బరాక్ - భారత తొలి యుధ్ద విమాన మహిళా పైలట్

26 ఏళ్ల అభిలాష బరాక్ చరిత్ర సృష్టించారు. భారత తొలి యుద్ధవిమానం మహిళా పైలెట్ గా రికార్డులకెక్కారు అభిలాష. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభిలాషకు కొవెటెడ్ వింగ్స్ అవార్డుతో భారత ఆర్మీ సత్కరించడమే కాదు, వింగ్ కమాండర్ హోదాను కూడా కల్పించింది. అభిలాష సాధించిన విజయాన్ని భారత ఆర్మీ ఏవియేషన్ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా అభివర్ణించారు అధికారులు.

రోహతక్, హర్యానా కు చెందిన అభిలాష మొత్తం 36 మంది ఆర్మీ పైలెట్ లతో కలిసి మహారాష్ట్రలోని నాసిక్ లో ఉన్న కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్లో కఠోర శిక్షణ పూర్తి చేసుకున్నారు. 2018లో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కార్ప్స్ లో నియమితులయ్యారు అభిలాష. సనావర్ లోని లారెన్స్ స్కూల్లో చదివిన అభిలాష, ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తి చేశారు.

ఇప్పటిదాకా ఎయిర్ ఫోర్స్, నేవీ లో మాత్రమే ఆఫీసర్ హోదాలో మహిళలు ఉండేవారు. అయితే సుప్రీం కోర్ట్ ఫిబ్రవరి 17, 2020 ఆర్మీ ఆఫీసర్ కమీషన్ తీసుకోవాలని తీర్పునిచ్చింది. అప్పటిదాకా ఉన్న లింగవివక్ష కి తోడు మహిళల కోసం సాధారణంగా కొన్ని ప్రత్యేక వసతులు అవసరమవుతాయని భావించారు ఆర్మీ ఆఫీసర్లు. దీంతో పాటు కేంద్రం కూడా అదే భావిస్తూ వచ్చింది. అయితే సుప్రీం కోర్ట్ తీర్పుతో తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. అప్పటిదాకా గ్రౌండ్ డ్యూటీ లకు మాత్రమే పరిమితమైన మహిళ ఆఫీసర్లను యుద్ధ విమానాలను నడపడానికి కూడా సిద్ధం చేయాలని నిర్ణయానికి వచ్చారు ఆర్మీ ఉన్నతాధికారులు. దీంతో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె 2021లో మహిళలను యుద్ధ విమానాల శిక్షణ కోసం తీసుకుంటున్నట్టు గా ప్రకటించారు. అలా అభిలాష కఠోరమైన శిక్షణ కోసం ఎంపికయ్యారు.

Next Story