90 గంటల పని కామెంట్స్..L&T ఛైర్మన్‌పై విమర్శల వెల్లువ

ఉద్యోగులు ఆదివారాలు కూడా 90 గంటలు పని చేయాలని, సండేస్ కూడా ఆఫీసులకు వెళ్లాలని L&T ఛైర్మన్ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

By Knakam Karthik  Published on  10 Jan 2025 5:40 PM IST
L&T CHAIRMAN SN SUBRAMANYAN, 90 HOURS WORK COMMENTS,DEEPIKA PADUKONE, GUTTA JWALA

90 గంటల పని కామెంట్స్..L&T ఛైర్మన్‌పై విమర్శల వెల్లువ

ఉద్యోగులు ఆదివారాలు కూడా 90 గంటలు పని చేయాలని, సండేస్ కూడా ఆఫీసులకు వెళ్లాలని L&T ఛైర్మన్ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. ఆయన వ్యాఖ్యలపై సెలబ్రిటీలు, ప్రముఖులు తీవ్రంగా రెస్పాండ్ అవుతున్నారు. ఎల్ అండ్ టీ ఉద్యోగులతో ఇటీవల ఆన్ లైన్‌లో సుబ్రహ్మణ్యన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంస్థలో వారానికి ఆరు రోజుల పని విధానాన్ని అమలు చేయడాన్ని ఓ ఉద్యోగి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా సుబ్రహ్మణ్యన్ స్పందిస్తూ... ఆదివారం కూడా మీతో పని చేయించలేకపోతున్నందుకు బాధపడుతున్నానని అన్నారు. మీతో ఆదివారాలు సైతం పని చేయిస్తే చాలా సంతోష పడుతానని చెప్పారు. ఎందుకంటే, నేను ఆదివారాలు కూడా పని చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఎంత సేపు ఇంట్లో కూర్చుంటావు? ఎంత సేపు నీ భార్యను అలా తదేకంగా చూస్తూ ఉండగలవు? ఆఫీసుకు వెళ్‌లి పని చేయడం ప్రారంభించు అని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా వారానికి 90 గంటలు పని చేయాలని కూడా హిత బోధ చేశారు సుబ్రహ్మణ్యన్. తాను ఓ చైనా వ్యక్తితో మాట్లాడానని, అక్కడి కార్మికులు వారానికి 90 గంటలు పని చేస్తారని, అమెరికన్లు 50 గంటలే పని చేస్తారు కాబట్టి కొన్ని రోజుల్లో అమెరికాను చైనా దాటేస్తుందని ఆ వ్యక్తి చెప్పినట్లు సుబ్రహ్మణ్యన్ ఆ మీటింగ్‌లో చెప్పారు. మీరు కూడా ప్రపంచంలో ఉన్నత స్థాయిలో ఉండాలంటే వారానికి 90 గంటలు పని చేయాల్సిందే అంటూ చెప్పారు.

ప్రస్తుతం సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. సగటు ఉద్యోగులే కాదు, సెలబ్రిటీల నుంచి నెట్టింట తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో సుబ్రహ్మణ్యన్ కామెంట్స్‌పై బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె ఘాటుగా స్పందించారు. సుబ్రహ్మణ్యన్ స్టేట్‌మెంట్‌పై సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి ప్రకటనలు షాకింగ్‌గా ఉందని అన్నారు. ఈ పోస్ట్‌కు #mentalhealthmatters అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది. తద్వారా మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని దీపిక అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఇదే ఇష్యూపై ఎక్స్ వేదికగా ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల స్పందించారు. ముందుగా అతను తన భార్య వైపు ఎందుకు చూడకూడదు.. కేవలం ఆదివారం మాత్రమే ఎందుకు చూడాలి? అంటూ ప్రశ్నించారు. అంత చదువుకున్నారు, పెద్ద సంస్థల అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు మానసిక ఆరోగ్యం, మానసిక విశ్రాంతిని సీరియస్‌గా తీసుకోకపోవడం ఏమిటని గుత్తా జ్వాల ట్వీట్ చేశారు. మరో వైపు ఇలాంటి స్త్రీ ద్వేష పూరిత స్టేట్ మెంట్స్ చేయడం, తమను తాము బహిరంగంగా బహిర్గతం చేసుకోవడం విచారకరమన్నారు. ఆ స్టేట్ మెంట్ నిరాశపరిచిందని, మరో వైపు భయానకంగా కూడా ఉందని ఎక్స్ వేదికగా గుత్తా జ్వాల ఫైర్ అయ్యారు.

Next Story