9 వందేభారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ.. తెలుగు రాష్ట్రాల నుంచి రెండు ట్రైన్లు

ప్రధాని నరేంద్ర మోదీ ఒకేసారి 9 వందే భారత్ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించారు.

By Srikanth Gundamalla  Published on  24 Sep 2023 8:45 AM GMT
9 Vande bharat, Trains, green flag, PM Modi ,

9 వందేభారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ.. తెలుగు రాష్ట్రాల నుంచి రెండు ట్రైన్లు

కేంద్ర ప్రభుత్వం వందేభారత్ రైళ్లను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రధాన నగరాల మధ్య ఇప్పటికే ఈ రైళ్లు వేగంగా పరుగులు పెడుతున్నాయి. వేగంగా దూసుకెళ్లడం.. అధునాతన సౌకర్యాలు.. త్వరగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా ఈ ట్రైన్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే.. తాజాగా దేశవ్యాప్తంగా మరో 9 వందే భారత్‌ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఒకేసారి దేశ వ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించిన రైళ్లలో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా రెండు రైళ్లు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ -బెంగళూరు కాగా.. మరోటి విజయవాడ-చెన్నై మార్గంలో నడవనుంది. దాంతో.. ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ సర్వీసులను మరింత విస్తరించినట్లు అయ్యింది. ఇప్పటికే పలుమార్గాల్లో వందేభారత్ సర్వీసులు నడుస్తున్నాయి.. ఆ రైళ్లకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని స్లీపర్, మినీ వందే భారత్ రైళ్ల సర్వీసులను విస్తరించాలని మోదీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. తాజాగా 9 వందేభారత్‌ రైళ్ల ప్రారంభంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత లభించింది.

హైదరాబాద్ – బెంగళూరు మధ్య పరుగులు పెట్టే వందే భారత్ రైలు ఉదయం 5.30 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరుతుంది. మహబూగ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్ పుర్ చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 2:40 గంటకలు యశ్వంత్‌పూర్‌ నుంచి బయల్దేరి రాత్రి 11:40 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. కాగా.. ఈ సర్వీసు బుధవారం మినహా మిగతా ఆరు రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

విజయవాడ-చెన్నై మధ్య పరుగులు పెట్టే వందేభారత్ విజయవాడ నుంచి మధ్యాహ్నం 3:20 గంటకలు ప్రారంభం అవుతుంది. రాత్రి 10 గంటలకు చెన్నై చేరుకుంటుంది. తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటల్లో స్టాప్‌లు ఉన్నాయి. తిరిగి చెన్నైలో ఉదయం 5.30 గంటలకు బయల్దేరే ఈ రైలు మధ్యాహ్నం 12.10 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అయితే.. ఈ సర్వీసు ఒక్క మంగళవారం తప్ప మిగతా అన్ని రోజుల్లో అందుబాటులో ఉంటుంది. కాగా ఇప్పటి వరకు బ్లూ కలర్‌లో కనిపించిన వందేభారత్‌ రైళ్లు.. ఇక నుంచి ఆరెంజ్‌ కలర్‌లో ఉండనున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాచిగూడ-యశ్వంత్పూర్‌, విజయవాడ-చెన్నై వందేభారత్‌ రైళ్లకు మోదీ పచ్చజెండా ఊపడంతో.. ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Next Story