ఆర్ధిక శాఖా మంత్రుల ప్రత్యేకతలేంటో తెలుసా
Know These Finamce Ministers Specialities
By - Nellutla Kavitha | Published on 31 Jan 2023 5:11 PM ISTమోదీ 2.0 ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్ లో ఏముందో తెలుసుకోవడానికి మరి కొద్ది గంటలే మిగిలి ఉంది. రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. తాను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని ఇటీవలే చెప్పిన ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఐదోసారి ఎలాంటి బడ్జెట్ ప్రవేశపెడతారు అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సామాన్య, మధ్య తరగతి, వేతన జీవులు ఈ బడ్జెట్ ను కీలకంగా భావిస్తున్నారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండవ మహిళ నిర్మల సీతారామన్. దీంతోపాటుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత రక్షణ శాఖ మంత్రిత్వ బాధ్యతలతో పాటుగా ఆర్థిక శాఖ బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళ కూడా నిర్మల సీతారామన్ మాత్రమే. ఈ నేపథ్యంలోనే ఇప్పటిదాకా ఆర్థిక శాఖకు మంత్రులుగా వ్యవహరించిన వారి ప్రత్యేకతలు, నేపథ్యాలు ఏంటో చూద్దాం.
• భారతదేశ చరిత్రలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి కూడా ఒక్కసారి కూడా బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశ పెట్టలేకపోయిన మంత్రి హెచ్ ఎన్ బహుగుణ. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి హేమ్వతి నందన్ బహుగుణ, 1979 లో అతి తక్కువ కాలం అంటే ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన బహుగుణ ఉత్తరప్రదేశ్ సీఎం గా పని చేసి, 1979 కాలంలో చరణ్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో అతి తక్కువ కాలమే ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినందున పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయారు.
• ఆర్థిక శాఖ మంత్రులుగా పని చేసిన ఇద్దరు ఆ తర్వాత రాష్ట్రపతులు కూడా అయ్యారు. వారే ఆర్. వెంకట్రామన్, ప్రణబ్ ముఖర్జీ.
• ఇక నలుగురు ఆర్థిక శాఖ మంత్రులు ఆ తర్వాతి కాలంలో ప్రధాన మంత్రులు కూడా అయ్యారు. వారు మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, వీ పీ సింగ్, మన్మోహన్ సింగ్.
• 1951 -1956 మధ్యకాలంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన సిడి దేశముఖ్ గతంలో ఒక సివిల్ సర్వెంట్. తను పార్లమెంటులో ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుతోపాటుగా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ని ఏర్పాటు చేశారు.
మూడు సార్లు కంటే ఎక్కువగా పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రుల వివరాలు ఇలా ఉన్నాయి…
• మురార్జీ దేశాయ్ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) 1959 - 1963, 1967 - 1969 మధ్య కాలంలో మొత్తం 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.
• టి కృష్ణమాచారి 1957, 1964, 1965 (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) మొత్తం మూడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. వెల్త్ టాక్స్ ని ప్రవేశపెట్టడంతో పాటుగా ఫుడ్ సబ్సిడీ ఫండ్ ను ఏర్పాటు చేశారు.
• యశ్వంతరావు బి చవాన్ 1971 - 1974 (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) ఈయన ఆర్థిక శాఖ మంత్రిగా పార్లమెంటులో నాలుగు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 1973 -74 ఆర్థిక సంవత్సరానికి గాను 550 కోట్లతో లోటు బడ్జెట్ ను ప్రవేశపెట్టినందుకు ఆ కాలంలో దానిని బ్లాక్ బడ్జెట్ గా అభివర్ణించారు.
• ప్రణబ్ ముఖర్జీ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) 1982 - 1984, 2009 - 2012 మధ్య కాలంలో మొత్తం ఏడుసార్లు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. నాబార్డ్ తో పాటుగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు.
• యశ్వంత్ సిన్హా (బిజెపి) 1998 - 2002 5 సార్లు ఆర్థిక శాఖ మంత్రిగా పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బ్యాంకింగ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డును రద్దు చేశారు.
• పి చిదంబరం (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) 1996 -1997, 2004 - 2008, 2013 ఆర్ధిక సంవత్సరానికి గాను ఎనిమిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. • అరుణ్ జైట్లీ (బీజేపీ) 2014 -2018 మధ్య కాలంలో పార్లమెంటులో ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇన్కమ్ డిక్లరేషన్ స్కీం తో పాటుగా గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ను ప్రారంభించారు.