బడ్జెట్ 2023 రూపొందించే టీం ఇదే

Meet The Team Budget 2023

By -  Nellutla Kavitha |  Published on  28 Jan 2023 11:15 AM GMT
బడ్జెట్ 2023 రూపొందించే టీం ఇదే

మోదీ2.0 ప్రభుత్వం తన చివరి బడ్జెట్ ను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది. ఆర్థిక శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్మలా సీతారామన్ 5వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ సర్కార్ ప్రవేశపెట్టబోతున్న చివరి బడ్జెట్ ఇదే. దీంతో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా బడ్జెట్ రూపొందించడం ఒకరకంగా కత్తి మీద సామూలాంటిది. ఇందుకోసం భారీ కసరత్తే చేసింది టీం. అలాంటి టీంలో ఎవరెవరున్నారు ఇప్పుడు చూద్దాం.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఎంఫిల్ (ఇంటర్నేషనల్ స్టడీస్) పట్టా అందుకున్నారు నిర్మల‌ సీతారామన్. కేంద్ర మంత్రి మండలిలో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళ. 2022లో కర్ణాటక రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యారు.

టీవీ సోమనాథన్ - ఆర్థిక శాఖకు ఉన్న ఐదుగురు సెక్రటరీలలో అత్యంత సీనియర్ వ్యక్తిని ఫైనాన్స్ సెక్రటరీ హోదా ఇస్తారు. బడ్జెట్ రూపకల్పన టీంలో అత్యంత సీనియర్ అయిన టీవీ సోమనాథన్ ఆర్థికశాఖ కార్యదర్శి. Department of Expenditure కు హెడ్ గా వ్యవహరిస్తున్నారు. ఆర్థిక శాస్త్రంలో పీహెచ్డీ చేసిన సోమనాథన్, 1987 తమిళనాడు ఐఏఎస్ క్యాడర్ అధికారి. ఈయన ప్రధానమంత్రి కార్యాలయంలో Apr 2015 - Aug 2017 మధ్య కాలంలో పనిచేశారు. నిధుల కేటాయింపు, ఖర్చులు, వెల్ఫేర్ స్కీమ్స్, సబ్సిడీ గురించి ఈయన అంచనాలు సిద్ధం చేస్తారు.

అజయ్ సేథ్ - నిర్మలా సీతారామన్ టీంలో మరో కీలక వ్యక్తి ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్. గతంలో బెంగళూరు మెట్రో ఎండీగానూ పని చేశారు. 1987 కర్ణాటక క్యాడర్ అధికారి. ప్రస్తుతం Group of 20 (G20) వ్యవహారాలు కూడా చూస్తున్నారు. గత కేంద్ర బడ్జెట్లో కూడా జాయింట్ సెక్రటరీగా వ్యవహరించారు. బడ్జెట్ తయారీకి ఉపయోగించే డేటా మొత్తం అజయ్ సేథ్ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. దీంతో పాటుగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో కీలకమైన డ్రాఫ్ట్ కాపీని టీవీ సోమనాథన్, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్ తో కలిసి రూపొందిస్తారు.

తుహిన్ కాంత పాండే - 1987 పంజాబ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి ఈయన. ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించడంలో కీలకంగా వ్యవహరిస్తారు. Department of Investment and Public Asset Management (DIPAM) - పెట్టుబడుల ఉపసంహరణ విభాగం కార్యదర్శి తుహిన్ కాంత పాండే. ఎయిర్ ఇండియా, నీలాంచల్ ఇస్పాత్ నిగం లను ప్రైవేటు సంస్థలకు విక్రయించడంలో కీలకంగా వ్యవహరించారు.

వివేక్ జోషి - 1989 హర్యానా ఐఏఎస్ క్యాడర్ అధికారి. యూనివర్సిటీ ఆఫ్ జెనీవా నుంచి ఇంటర్నేషనల్ ఎకనమిక్స్‌లో ఎంఏ, పీహెచ్డీ పూర్తి చేశారు. ఫైనాన్స్ సర్వీసెస్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకోక ముందు రిజిస్ట్రార్ జనరల్, జనాభా లెక్కల కమిషనర్ గా పనిచేశారు. ఇటీవలే సంజయ్ మల్హోత్రా స్థానంలో ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ విభాగం పరిధిలోకి బ్యాంకులు, ఆర్థిక సేవలు, ఇన్సూరెన్స్ సంస్థలు వస్తాయి.

సంజయ్ మల్హోత్రా - ఆర్థిక శాఖ మంత్రిత్వ కార్యదర్శులలో అత్యంత జూనియర్ కార్యదర్శి ఈతను. 1990 రాజస్థాన్ ఐఏఎస్ క్యాడర్ అధికారి. కేంద్ర ఆర్థిక శాఖలో రెవెన్యూ విభాగం అధికారిగా సంజయ్ మల్హోత్రా ఉన్నారు. ఇక్కడికి రాకముందు కేంద్ర విద్యుత్ శాఖలో పనిచేశారు. రెవెన్యూశాఖ కార్యదర్శిగా పన్నుల రాబడిపై అంచనాలు రూపొందించడంలో కీలకంగా వ్యవహరిస్తారు సంజయ్ మల్హోత్రా.

అనంత నాగేశ్వరన్ - చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. IIM అహ్మదాబాద్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు అత్యంత నమ్మకమైన అడ్వైజర్ గా భావిస్తారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్. బడ్జెట్ ప్రసంగంలో అత్యంత ముఖ్యమైన కీ పాయింట్స్ ఇవ్వడంతో పాటుగా ఎకనామిక్ సర్వేల గురించి కూడా వివరిస్తారు. కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాలను ఈ ఆర్థిక సర్వే వెల్లడిస్తుంది. ఈ నెల 31న పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి ప్రవేశ పెట్టే ఆర్థిక సర్వే రూపకల్పనలో ఆయన కీలకం. G20 లో కూడా కీలకంగా ఉన్నారు.

Next Story