మహారాష్ట్రలో మహా ట్విస్టులతో కొత్త సర్కార్

Eknath Shinde Becomes New CM And Fadnavis Is DyCM Of Maharashtra

By -  Nellutla Kavitha |  Published on  30 Jun 2022 2:34 PM GMT
మహారాష్ట్రలో మహా ట్విస్టులతో కొత్త సర్కార్

మహారాష్ట్రలో పొలిటికల్ హై డ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. పదిరోజులుగా మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నడిచింది. అయితే బీజేపీ మాత్రం చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.

తలపండిన రాజకీయ విశ్లేషకులు కూడా వూహించని రీతిలో బీజేపీ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్రలో బీజేపీ తదుపరి ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని, మాజీ సీఎం, బీజేపీ నేత ఫడ్నవీస్ సీఎం అవుతారని అందరూ భావించారు. కానీ బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. గవర్నర్ కోష్యారీ, ఏక్నాథ్ షిండే తో సీయంగా, ఫడ్నవీస్ ను డిప్యూటీ సీయంగా ప్రమాణ స్వీకారం చేయించారు.

ఇంతకాలం వివిధ రాష్ట్రాల్లో బీజేపీకి మెజార్టీ లేకపోయినా దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చిందనే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అయితే ప్రభుత్వాల్ని కూల్చే సంస్కృతి తమది కాదనే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది.

ఈసారి మాత్రం మహారాష్ట్ర విషయంలో ఆ అపవాదును బీజేపీ మూటగట్టుకోవద్దని భావించి ఉంటుందని విశ్లేషకులుఅంచనా వేస్తున్నారు. అందుకే అనూహ్యంగా మహారాష్ట్ర తదుపరి సీఎంగా శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహించిన ఏక్ నాథ్ షిండే పేరును ప్రకటించారు. మాజీ సీయం ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయడం కూడా ఇక్కడ మరో ట్విస్ట్. తమపై వస్తున్న ఆరోపణలు తొలగించుకొనేందుకు సీఎం పదవిని షిండే కు కట్టబెట్టింది. శివసేనలో రేగిన సంక్షోభానికి, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పడానికే బీజేపీ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే ఈ రోజు రాత్రి 7.30 గంటలకు, ఆ తర్వాత మాజీ సీయం దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీయం గా ప్రమాణ స్వీకారం చేసారు. అయితే ఈ రోజు కేవలం షిండే మాత్రమే సీయంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఫడ్నవీస్ తెలిపారు. కానీ అనూహ్యంగా చివరలో ఫడ్నవీస్ పేరు తెరపైకి వచ్చింది. మిగితా మంత్రివర్గం ఎవరూ ప్రమాణ స్వీకారం చేయకపోయినా ఫడ్నవీస్ మాత్రం డిప్యూటీ గా ప్రమాణం చేసారు. తాను ప్రభుత్వానికి దూరంగా ఉంటానని స్పష్టంచేసినా కేంద్ర బీజేపీ నిర్ణయం మేరకే చివరలో ఈ ట్విస్ట్ వచ్చిందని భావిస్తున్వారు. అయితే మంత్రి పదవుల విషయంలో మాత్రం బీజేపీ మెజార్టీ భాగాన్ని ఆక్రమిస్తుందని అంచనాలున్నాయి.

ఇక శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే ను ముఖ్యమంత్రిగా ఈ మధ్యాహ్నం ప్రకటించగానే ఆయనకు మద్దతు గా నిలిచిన ఎమ్మెల్యేలంతా గుంపుగా చేరి డాన్సులు చేశారు. కొంతమంది టేబుల్స్‌పైకి ఎక్కి డాన్సులు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story