సీజే ప్రమాణస్వీకార కార్యక్రమం - తొమ్మిది నెలల తర్వాత రాజ్ భవన్ కు సీయం కేసీఆర్
CM KCR Reaches RajBhavan After Nine Months To Attend Swearing-in Ceremony Of HC CJ Ujjal Bhuyan
By - Nellutla Kavitha | Published on 28 Jun 2022 10:50 AM IST
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నరు ఆయనచేత ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్ర హైకోర్టు ఏర్పడ్డాక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఐదో న్యాయమూర్తి జస్టిస్ భూయాన్. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఈరోజు ఉదయం 10.00 గంటలకు ప్రమాణస్వీకారం చేసారు. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రొటోకాల్ ప్రకారం హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరుకావాల్సి ఉంటుంది, అయితే గవర్నర్‌కు, సీఎం కేసీఆర్‌కు ఉన్న విభేదాల నేపథ్యంలో ఈసారి కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్న అంశంపై సందేహాలు ఏర్పడ్డాయి. కానీ ఈ కార్యక్రమానికి ఆయన అటెండ్ అవుతారని సీఎంవో వర్గాలు ధ్రువీకరించాయి.
హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ప్రమాణ స్వీకారం చేసిన భూయాన్ అస్సాంలో జన్మించారు. ఆయన 1991లో న్యాయవాది వృత్తి చేపట్టారు. గత ఏడాది అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సమర్థతను చాటారు. ఇక ఇప్పటిదాకా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా సేవలందించిన సతీష్ చంద్ర మిశ్రా బదిలీ కావడంతో ఆయన స్థానంలో జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ను హైకోర్టు కొత్త సీజేగా నియమించారు. జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రాను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కు పదోన్నతి కల్పించి సీజేగా నియమించేందుకు కొలీజియం సిఫార్స్ చేసింది. ఐదు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్ ల నియమకానికి సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవలే సిఫార్స్ చేసింది.
ఇక సీయం కేసీఆర్ రావడం ఆసక్తికరంగా మారింది. దాదాపు ఏడాదికాలంగా ప్రగతి భవన్ కి రాజ్ భవన్ కు మధ్య విభేదాలు కనిపిస్తూ వస్తున్నాయి. గవర్నర్ తమిళ సై తన అధికార పరిధిని అతిక్రమించి వ్యవహరిస్తున్నారని, రాజ్ భవన్ ను బీజేపీ కార్యకలాపాలకు అడ్డాగా మార్చారని మంత్రులు, టిఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డిని నామినేట్ చేయాలని టిఆర్ఎస్ చేసిన ప్రతిపాదనను గవర్నర్ పెండింగ్లో పెట్టిన దగ్గర నుంచి ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజభవన కే పరిమితం చేయడం, సీఎంతో పాటు మంత్రులు ఇతర ఉన్నతాధికారులు హాజరుకాకపోవడం, గవర్నర్ కు ఇవ్వాల్సిన మర్యాద, ప్రోటోకాల్ పాటించడం లేదని బిజెపి ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈమధ్య రాజ్ భవన్ లో జరిగిన ఉగాది వేడుకలకు ముఖ్యమంత్రి హాజరు కాకపోవడంతో పాటు గవర్నర్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని గవర్నర్ తో పాటుగా ఇతర బీజేపీ నేతలు కూడా అవకాశం వచ్చినప్పుడల్లా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే తొమ్మిది నెలల తర్వాత రాజభవనానికి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి చేరుకున్నారు. తెలంగాణ హైకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాజభవనానికి వచ్చారు. అయిదవ చీఫ్ జస్టిస్ గా భూయాన్ చేత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు ప్రమాణస్వీకారం చేయించారు. అయితే అక్టోబర్ తర్వాత రాజ్ భవన్ కు ముఖ్యమంత్రి కెసిఆర్ రావడం ఇదే మొట్టమొదటిసారి. ఈ మధ్య రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, పెరుగుతున్నటువంటి విభేదాల నేపథ్యంలో ప్రగతి భవన్ కు, రాజభవన్ కు మధ్య గ్యాప్ తగ్గిపోతుందా లేకుంటే అలాగే కంటిన్యూ అవుతుందా అనే ఆసక్తి ఇప్పుడు సర్వత్రా నెలకొంది. అయితే ప్రోటోకాల్ ప్రకారం చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కావాలి కాబట్టి కెసిఆర్ అటెండ్ అయ్యారు అని, అదే సంప్రదాయాన్ని ఈరోజు కొనసాగించారని భావిస్తున్నారు. మరి గవర్నర్ కు, ముఖ్యమంత్రికి మధ్య ఏర్పడ్డ గ్యాప్ ప్యాచప్ అవుతుందా లేకుంటే ఇలాగే కంటిన్యూ అవుతుందా అనేది కాలమే సమాధానం చెబుతుంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్తున్నారు.