ప్చ్.. బాక్సాఫీస్ వద్ద నలిగిపోతున్న హీరోలు !

By Newsmeter.Network  Published on  5 Dec 2019 9:06 AM GMT
ప్చ్..  బాక్సాఫీస్ వద్ద నలిగిపోతున్న హీరోలు !

సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ కంటే కూడా.. సక్సెస్ ఉంటేనే ఛాన్స్ లు ఎక్కువ వస్తాయి. హిట్ ఉంటే కమెడియన్ కూడా హీరో అయిపోవచ్చు.. అదే హిట్ లేకపోతే హీరో కూడా కమెడియన్ గా చెయ్యాల్సి రావొచ్చు. ఏది ఏమైనా ఇక్కడ హిట్ ఉంటేనే వాల్యూ. అందుకేనేమో చిన్న హీరో దగ్గర నుండీ పెద్ద హీరో దాకా హిట్ కోసమే పరితప్పిస్తుంటారు. కానీ చాలా కాలం నుంచి హిట్ కోసం ట్రై చేస్తూ, హిట్ కొట్టలేక బాక్సాఫీస్ వద్ద ప్లాప్ హీరోలుగా మిగులుతున్న వాళ్ళు టాలీవుడ్ లో ప్రతి ప్రొడక్షన్ హౌస్ కి ఒక్కరు కనిపిస్తారు. బాలకృష్ణ, నాగార్జున, రవితేజ దగ్గరనుంచీ గోపీచంద్, నితిన్, అఖిల్ మీదుగా ఆ మధ్యలోని పదుల సంఖ్యలో ఉన్న మీడియమ్ హీరోలూ ఇలా చెప్పుకుంటూ పోతే నలుగురు ఐదుగురు హీరోలు తప్ప ప్రస్తుతం అందరూ ప్లాప్ లిస్ట్ లోని ముఖ్య సభ్యులే.

ఐదారేళ్ళ క్రితం తోటి హీరోలు అసూయ పడేలా కంటిన్యూగా హిట్స్ మీద హిట్స్ కొట్టిన అల్లరోడు.. ప్రస్తుతం హిట్ లేక ప్లాప్ ల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాడు. అలాగే ఒకప్పుడు 'ప్లాప్ హీరో'కి సింబాలిజమ్ లా మారిపోయిన నితిన్.. ఎట్టకేలకూ మళ్లీ మినిమమ్ గ్యారింటీ హీరోగా చలామణి అవుతున్న సమయంలో.. ‘లై’, ‘చల్ మోహన్ రంగా’, ‘శ్రీనివాస కళ్యాణం’ అంటూ భారీ డిజాస్టర్లతో మళ్లీ బాక్సాఫీస్ వద్ద మునిగిపోయాడు. ఇక గోపీచంద్‌ కి అయితే ప్లాప్ లు తప్ప అసలు హిట్లు రాను అంటున్నాయి. అలాగే మూడు చిత్రాలు చేసినా ఇంతవరకూ అక్కినేని అఖిల్ ఖాతాలో కనీసం ఎబౌవ్ ఏవరేజ్ హిట్ కూడా లేకపాయే. రవితేజ గురించి చెప్పుకుంటే మధ్యలో 'రాజా ది గ్రేట్' తప్ప ఆ సినిమాకి ముందు చేసిన బెంగాల్ టైగర్, కిక్ 2, ఆ సినిమా తరువాత చేసిన 'టచ్ చేసి చూడు', 'నేల టిక్కెట్టు', 'అమర్ అక్బర్ ఆంటోని' ఇలా అన్ని సినిమాలు అత్యన్నతమైన ప్లాప్ సినిమాలే.

ఇక నాగార్జున చేసిన చివరి నాలుగు సినిమాలు అద్భుతమైన డిజాస్టర్లు. పాపం బాలయ్య బాబు కూడా 'కథానాయకుడు, మహానాయకుడు'లతో ప్లాప్ లో పూర్తిగా మునిగిపోయాడు. అదేవిధంగా చాల సినిమాల నుండీ మంచి హిట్ కోసం హీట్ ఎక్కేలా ఫైట్ చేస్తోన్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ‘చిత్రల‌హరి’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకోలేకపోయాడు. ఇక మంచు హీరోల పరిస్థితి తెలిసిందే. మొత్తానికి ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్టీఆర్, మహేష్, ఎఫ్ 2తో వెంకటేష్ లాంటి నలుగురు ఐదుగురు తప్ప మిగిలిన హీరోలంతా హిట్ వేటలో నలిగిపోతున్న వారే.

Next Story
Share it