టాలీవుడ్ బిగ్గీస్.. ఏది ఎప్పుడు?
By సుభాష్ Published on 26 May 2020 2:37 PM ISTమే 15న ‘వకీల్ సాబ్’.. స్వాంతత్ర్య దినోత్సవ కానుకగా ‘ఆచార్య’.. దసరాకు ప్రభాస్ సినిమా.. సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’.. ఇలా కొన్ని నెలల కిందటే ఏడాది కాలానికి పక్కాగా షెడ్యూళ్లు వేసుకుని రెడీ అయ్యాయి టాలీవుడ్ బడా చిత్రాలు. ఈ మేరకు నిర్మాతల మధ్య అవగాహన కూడా కుదిరింది. కానీ కరోనా వచ్చి ఈ ప్రణాళికలన్నీ చెడగొట్టేసింది. షూటింగులు ఆగిపోయాయి. కొత్త షెడ్యూళ్ల సంగతి తెలియదు. థియేటర్లు మళ్లీ ఎప్పుడు తెరుచుకుంటాయో.. తెరుచుకున్నా మునుపటిలా సాధారణ స్థాయిలో ఎప్పటికి నడుస్తాయో తెలియదు. ఈ నేపథ్యంలో పై భారీ చిత్రాలన్నీ విడుదల తేదీలు మార్చుకోక తప్పట్లేదు. ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే.. వీటిలో ఏ చిత్రం ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటే..
పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇవ్వబోతున్న ‘వకీల్ సాబ్’ను ఈ ఏడాది ఆరంభంలోనే మొదలుపెట్టి వేసవికే విడుదల చేయాలనుకున్నారు. చిత్రీకరణ చాలా వరకు పూర్తి చేశారు. కానీ చివరి దశలో లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. పవన్ ఇంకో పది రోజులు చిత్రీకరణలో పాల్గొంటే చాలు. అతడి కాంబినేషన్ లేని సన్నివేశాలు కూడా కలిపితే మూడు వారాల్లో షూటింగ్ పూర్తవుతుంది. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చేయాలి. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో జూన్లో చిత్రీకరణ మొదలు పెట్టొచ్చు. గట్టిగా అనుకుంటే దసరాకు సినిమాను రిలీజ్ చేసేయొచ్చు. కానీ అప్పటికి థియేటర్లు తెరుచుకున్నా కూడా కొన్ని పరిమితుల మధ్య నడపాల్సి ఉంటుంది. ఆడిటోరియంలో అన్ని సీట్లనూ నింపే అవకాశం లేదు. కాబట్టి అలాంటి టైంలో ఇలాంటి భారీ చిత్రాన్ని రిలీజ్ చేయకపోవచ్చు. క్రిస్మస్ సమయానికి పరిస్థితులు మెరుగు పడే అవకాశముంది కాబట్టి ఆ సీజన్లో రిలీజ్ చేసేందుకు అవకాశం ఉంది.
ఇక చిరు సినిమా ‘ఆచార్య’ విషయానికి వస్తే.. ఇప్పటికే సగం చిత్రీకరణ పూర్తయింది. సినిమా పూర్తి కావడానికి ఇంకో మూడు నెలల దాకా పట్టొచ్చు. జూన్లో షూటింగ్ పున:ప్రారంభించి ఇన్ డోర్ సీన్లన్నీ తీసేసి పూర్తిగా ఆంక్షలన్నీ తొలగిపోయాక ఔట్ డోర్లో తీయాల్సిన భారీ సన్నివేశాలు తెరకెక్కిస్తారు. ఈ ఏడాది చివరికి సినిమా పూర్తయ్యే అవకాశముంది. ఎలాగూ ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది కాబట్టి ఆ పండక్కే ‘ఆచార్య’ను రిలీజ్ చేసే అవకాశముంది.
‘సాహో’ తర్వాత ప్రభాస్.. ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న లవ్ స్టోరీ చిత్రీకరణ 80 శాతం పూర్తయింది. మిగిలింది 20 శాతమే అయినా.. ప్రభాస్ సినిమా స్కేల్ ఎలా ఉంటుందో చెప్పేదేముంది? యూరప్‌లో కొంత చిత్రీకరణ చేయాల్సి ఉన్నా.. ఇప్పుడిప్పుడే అక్కడికి వెెళ్లే అవకాశం లేకపోవడంతో సెట్టింగ్స్ వేసి ఇక్కడే ఆ సన్నివేశాలు తీసేయాలని ఫిక్సయ్యారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడానికి మూణ్నాలుగు నెలలు పడుతుంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి వివిధ భాషల్లో డబ్బింగ్, మిగతా పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్.. వీటికి చాలా సమయం పడుతుంది. కాబట్టి వచ్చే ఏఢాది వేసవిలో ప్రభాస్ కొత్త చిత్రాన్ని విడుదల చేయొచ్చని అంటున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ విషయానికి వస్తే వచ్చే జనవరి 8న సినిమా రాదని నిర్మాత డీవీవీ దానయ్య ఇప్పటికే సంకేతాలు ఇచ్చేశాడు. రాజమౌళి ఏం తీసినా భారీగా ఉంటుంది. ఆయన సినిమాలో ఇంకా 30 శాతం షూటింగ్ మిగిలి ఉంటుందంటే అందుకోసం ఒక ఆర్నెల్లయినా సమయం పడుతుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ఆషామాషీగా అయ్యేవి కావు. ప్రమోషన్ కూడా ఒక ప్లాన్ ప్రకారం గట్టిగా చేయాల్సి ఉంటుంది. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తీస్తున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది మధ్యలో కానీ వచ్చే అవకాశం లేనట్లే. బహుశా ఈ ఏడాది జులై 30న అనుకున్నది వచ్చే ఏడాది అదే సమయానికి రిలీజ్ చేస్తారేమో.